‘కాంతార’ సినిమా ఎంత హిట్టో, అందులోని ‘వరాహరూపం..’ పాట అంత పాపులర్. ఈ పాటకు గాయని శ్రీలలిత భమిడిపాటి చేసిన కవర్‌సాంగ్ కూడా అదే రేంజ్లో ప్రాచుర్యం పొందింది. యూట్యూబ్‌లో ఏకంగా 50 లక్షల వ్యూస్‌ను అధిగమించింది. ఆరేండ్ల వయసు నుంచీ రియాలిటీ షోలలో మనల్ని మెప్పిస్తున్న ఈ గాయని ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా సత్తా చాటుతున్నది. తన సరిగమల ప్రయాణాన్ని శ్రీలలిత పంచుకుందిలా..
‘ఎవరికైనా అమ్మ జోలపాటే మొదటి పాట. నాకూ అంతే. కాకపోతే అమ్మ గాయని కాబట్టి శ్రుతిలయలతో జోలపాడి నన్ను నిద్రపుచ్చేది. అన్నట్టు, నాన్న పాటల ఊయలలోనూ నేను ఊగాను. నాన్నా గాయకుడే. అమ్మమ్మ వాళ్లూ, ముత్తాతలు కూడా సంగీత విద్వాంసులే. అమ్మకు అమ్మవారంటే భక్తి. అందుకే నాకు శ్రీలలిత అని పేరు పెట్టుకుంది. నేను పుట్టగానే, నన్ను గాయనిగా చేయాలని ఆశ పడింది. దానికి తగ్గట్టు నాకూ గీతాల మీద ఎనలేని మక్కువ. మూడున్నరేండ్ల వయసులో.. స్టేజీ మీద ఎవరో రైమ్ చెప్పమని అడిగితే లింగాష్టకం చక్కగా పాడానట. నేర్పకుండానే ఎలా చెప్పిందా అని అమ్మ ఆశ్చర్యపోయింది. పూజ చేసుకునేప్పుడు నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకునేదట. అలా పట్టేశానన్నమాట. చిన్నప్పటి నుంచే స్టేజీ మీద ప్రదర్శన ఇవ్వడం అలవాటైంది. ఆరేండ్లు కూడా నిండకుండానే ఓ ముప్పై నలభై పాత సినిమా పాటలు నేర్చుకున్నా. అప్పుడే ‘సరిగమప లిటిల్ చాంప్స్’కు ఎంపికయ్యా.
చదువంతా సంగీతమే..
‘లిటిల్ చాంప్స్’, ‘పాడుతా తీయగా’, ‘బోల్ బేబీ బోల్’, ‘స్వరాభిషేకం’.. ఇలా పదిహేను ఇరవై రియాలిటీ షోలలో పాల్గొన్నా. బాల్యం నుంచి పాటలే నా ప్రపంచం. దీంతో బడి కెళ్లింది తక్కువ. పదో తరగతిలో కూడా మూడు నెలలే వెళ్లాను. అయినా సరే స్కోర్ 9.8 వచ్చింది. గాయకులనే కాదు, కళల్లో ప్రవేశం ఉన్న ఎవరైనా సబ్జెక్టులను ఇట్టే ఆకళింపు చేసుకోగలరు. కళాకారులలో అవగాహన శక్తి ఎక్కువ. మ్యూజిక్‌లో డిప్లొమా, బీఏ ఇంటి నుంచే చేశాను. ప్రస్తుతం ఎంఏ మ్యూజిక్ చదువుతున్నా. నా చదువు, కెరీర్‌కు సంబంధించి చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఎన్ని అనుమానాలు వ్యక్తం చేసినా.. నా ఆసక్తిని బట్టి అమ్మానాన్న సంగీత శిక్షణకే మొగ్గుచూపడం ఆనందాన్నిచ్చే విషయం. మా తాతయ్య వాళ్లది రాజమండ్రి. నాన్న ఉద్యోగ రీత్యా హైదరాబాద్, విజయవాడ, కంచి, బిహార్.. ఇలా ఎన్నో చోట్ల ఉన్నాం. ఇప్పుడు కోయంబత్తూరులో ఉంటున్నాం. ఎక్కడ ఉంటే అక్కడి పాటలు సాధన చేస్తాను. అందుకే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పాడగలను. ప్రస్తుతం నా కర్ణాటక సంగీత గురువు మోదుగుమూడి సుధాకర్. కౌశికి చక్రవర్తి దగ్గర హిందుస్థానీ నేర్చుకుంటున్నా.
కొవిడ్ సమయంలోనే కరోనా లాక్డౌన్లో నెలల పాటు ఎలాంటి కార్యక్రమాలూ లేవు. అప్పుడే తెలిసిన వాళ్లొకరు యూట్యూబ్ ఛానెల్ పెట్టమని సలహా ఇచ్చారు. అలా 2019 చివర్లో ‘శ్రీలలిత సింగర్’ ప్రారంభించాను. చాలా మంది సంగీతాభిమానులు ఆదరించారు. ప్రస్తుతం 2 లక్షల ఇరవైవేల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇటీవల కజు అనే సంగీత పరికరంతో కలిపి వరాహరూపం పాట పాడాను. కొద్ది రోజుల్లోనే ఐదు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఓ సంగీత శిక్షణ సంస్థ స్థాపించి, నలుగురికీ పాటలు నేర్పాలన్నది నా లక్ష్యం. నేను ఏ పోటీకి వెళ్లినా పాడేటప్పుడు పాటను పరిపూర్ణంగా ఆస్వాదిస్తా. గెలుపు ఓటముల గురించి ఆలోచించను. ఒకవేళ బహుమతి రాకపోయినా బాధపడను. బహుమతుల కంటే పాటను సాధన చేయడం, దాన్ని చక్కగా ప్రదర్శించడం… ఈ రెండిటినీ ఎక్కువగా ఇష్టపడతాను.
బాలుగారు ఐస్‌క్రీమ్ ఇచ్చారు..
నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం.. బాలుగారి ముందు పాడటం. పదకొండేండ్ల వయసులో ఆయన ముందు తొలిసారి ఆలపించాను. ఆ రోజు నేను పాడిన ఒక సంగతి బాగా నచ్చి మళ్లీ పాడించుకున్నారు. ‘పాడుతా తీయగా’ అప్పుడయితే అమ్మానాన్నలకు తెలియకుండా మాకు ఐస్‌క్రీమ్‌లు కొనిచ్చేవారు. ‘చక్కగా తినండి. ఏం కాదు’ అని చెప్పేవారు. కార్యక్రమానికి ముందు పిల్లలతో కలిసి సందడి చేసేవారు. మైక్ ఎలా పట్టుకోవాలి, ఎలా నిల్చోవాలి, శ్వాస ఎలా నియంత్రించాలి.. ఇలా చాలా చిట్కాలు చెప్పేవారు. ఆయనతో పరిచయం గొప్ప అనుభవం. కోటి సర్ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. శ్వాసతీసుకోకుండా 13 నిమిషాల పాటు పాట పాడినప్పుడు మెడలో దండ వేసి మరీ అభినందించారు.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి