వారి మాటకు వేదం ప్రమాణం. వారి మాట వేద ప్రమాణం. ‘సాధనాత్ సాధ్యతే సర్వమ్’ అన్న గురువాక్కును నిరంతరం ఆచరిస్తూ కొనసాగిస్తున్న వారి ప్రయాణం నిత్య స్మరణీయం. తెలంగాణంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ, వేద విద్యను ప్రోత్సహిస్తూ, ఆచార వ్యవహారాలకు కొమ్ముకాస్తూ… సదా సదానంద సంప్రదాయ విలువల్ని పరిరక్షిస్తున్న యతీశ్వరులు వారు. కోటి రుద్ర పారాయణలు, కోటి శ్రీసూక్త పారాయణ అనే బృహత్ క్రతువుకు శ్రీకారం చుట్టి.. భగవత్ ప్రేరణను పూరణ గావిస్తున్న శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠాధీశ్వరులు, శ్రీ సదానంద మఠాధీశ్వరులు, బసవకళ్యాణ్ 80వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారితో ‘చింతన’ ముఖాముఖి..
ఆశావాదం, అవకాశవాదం, నిరాశావాదం.. ఈ మూడు మనలో ఎప్పుడూ కొట్టుమిట్టాడుతుంటాయి. ఆశలేకుండా ఎవరూ ఉండొద్దు. మనిషి ‘నెవర్ బీ పెసిమిస్ట్. మస్ట్ బీ ఆప్టమిస్ట్. సమ్ టైమ్స్ మే బీ ఆపర్చునిస్ట్’- మనుషులు నిరాశావాదులుగా మిగిలిపోకూదు. ఆశావాదులుగా ఉండాలి. అప్పుడప్పుడు సాధనను భక్తికి, భక్తిని సాధననకు మార్చుకుంటూ, అవకాశాన్ని వినియోగించుకుంటూ, పరమాత్మను చేరడానికి అవకాశవాదులుగా ఉండటం తప్పుకాదు. కానీ, నిరాశవాదంలో మాత్రం ఎప్పటికీ కూరుకుపోవద్దు.
విరివిగా మహారుద్ర పారాయణలు చేస్తున్నారు. ఈ క్రతువు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం తెలియజేయగలరు?
ఎంతో మంది మహనీయులు రుద్ర పారాయణలు చేసి తరించారు. మన ప్రాంతంలో వేల సంఖ్యలో అతి రుద్రాలు జరిగాయి. మా గురువులు, పరంపరాగతమైన గురువులు అనుసరించిన మార్గంలో పయనిస్తూ.. రుద్ర పారాయణలు ప్రారంభించడం జరిగింది. ఉపనయన సంస్కారం విధిగా చేసుకొని, మన దేశానికి పరిమితమైన బ్రాహ్మణులతో ఈ రుద్ర పారాయణలు చేయించడం జరుగుతున్నది. కోటి రుద్ర పారాయణలు, కోటి శ్రీసూక్త పారాయణలు, వెయ్యి కోట్ల ‘శ్రీమాత్రే నమః’ మంత్ర జపం చేయించాలని భగవత్ ప్రేరణ. ఆయా వ్యక్తులు ఇండ్లల్లో కూర్చుని పారాయణం చేయడమే కాకుండా, ప్రజా సమూహానికి కూడా ఈ విషయం చేరవేయాలనే ఉద్దేశంతో వివిధ క్షేత్రాల్లో మహారుద్రం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రుద్ర పారాయణంతోపాటు శ్రీసూక్త పారాయణం, వీటికి అనుబంధంగా అభిషేకం, లక్ష పుష్పార్చన లేదా లక్ష తమలపాకుల అర్చన కూడా చేపడుతున్నాం.
బసవకళ్యాణ్ 80వ పీఠాధిపతిగా..
మదనానంద స్వామి పరంపరను కొనసాగించడంలో మీరు అనుసరించే మార్గం..?
మనమంతా సదానంద సంప్రదాయంలో కొనసాగుతున్నాం. కలియుగ ప్రారంభానికి 200 సంవత్సరాల ముందు సదానంద స్వామి ఉన్నారని ఆర్యోక్తి. కాలక్రమంలో మన ఆచార వ్యవహారాల్లో అనేకానేక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. అయినప్పటికీ, సన్యాసి ధర్మాలు మారలేదు. సన్యాసి పరంపరలో కొనసాగుతూనే, సామాజికంగా ఉంటున్న ప్రతివారినీ ఆదరిస్తూ, శాంతియుత మార్గంలో ఉండాలనేది మా గురువుల ఆశయం. వారు అనుసరించి, సూచించిన మార్గాన్ని అనుగమిస్తూ, ముందుతరాలను ఆ బాటలో పయనించేలా సమాయత్తం చేయడమే మా కర్తవ్యం. మా గురువులు చెప్పిందేమిటంటే.. అందరికీ భోజనం అందివ్వాలి, అందరితో జపం, భజన చేయించాలి, పరోపకార గుణ సంపన్నులుగా తీర్చిదిద్దాలి, ప్రశాంతంగా ఉండేలా ప్రోత్సహించాలి, ఆశ తక్కువగా ఉండాలి, ఆశయ సాధకులుగా మారాలి.. ఇదే మా సిద్ధాంతం. భగవత్ సేవే ప్రధాన ఆశయం..
మీ పరమ గురువు మదనానంద సరస్వతి స్వామి వారితో మీ అనుభవాలు పంచుకోగలరు?
నా జీవనం మొత్తం మా పరమ గురువుగారి పరిపూర్ణమైన అనుగ్రహంతో నడిచింది, నడుస్తున్నది. దానిని ప్రత్యేకంగా నిర్వచించి చెప్పడం సాహసమే అవుతుంది. చక్కెర గురించి వర్ణించి చెప్పొచ్చేమో కానీ, దానిలోని తీపిని గురించి చెప్పడం చాలా కష్టం. నేను చేసే ప్రతి చర్యా.. మా గురువులు చేసిన దానిలో కోటి భాగం అని మాత్రం చెప్పగలను. ఇక మా గురుదేవులు కృష్ణానంద సరస్వతీ స్వామి వారు ‘సాధనాత్ సాధ్యతే సర్వమ్’ అని తరచూ చెప్పేవారు. నిరాడంబరంగా ఉండాలని చెబుతూ ఉండేవారు. అలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను.
పీఠం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావించగలరు?
తెలంగాణ ప్రాంతంలో సన్యాసి సంప్రదాయ పరంపరను పరిపూర్ణంగా కొనసాగించడమే ధ్యేయంగా… కృష్ణానంద సరస్వతీ స్వామివారు.. మదనానంద సరస్వతీ స్వామివారిని మూల పురుషుడిగా ‘గురు మదనానంద సరస్వతీ పీఠాన్ని’ స్థాపించారు. పీఠం అంటే ఆశ్రయించే సంస్థ. అన్నీ కార్యక్రమాలు పీఠం ప్రేరణతో, పీఠం కేంద్రంగా జరుగుతాయి. ఈ పీఠం తరఫున వేద పాఠశాల నిర్వహిస్తున్నాం. ‘శ్రీగురు మదనానంద వేదపాఠశాల’ ద్వారా తెలంగాణ అనగానే మన పాఠశాలలో చదువుకున్న సామవేద పండితులు ఉండాలన్నది మా ఉద్దేశం. రుగ్వేదంలోనూ చక్కటి ప్రతిభావంతులైన పండితులను తీర్చిదిద్దుతున్నాం. పూర్ణమైన పరీక్ష నిర్వహించి.. సమర్థులైన వేద పండితులను తయారుచేస్తున్నాం. వైదిక విద్యతోపాటు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యార్థులకు లౌకిక విద్య, కంప్యూటర్ విద్య కూడా చెప్పిస్తున్నాం. వేద విద్యార్థులను కూడా స్మార్త విభాగంలో పూర్ణ నిష్ణాతుల్ని చేస్తున్నాం. ఇక, సమాజంలో రకరకాలైన వ్యక్తులు ఉంటారు. శక్తులూ ఉంటాయి. ఆ వ్యక్తులను, శక్తులను ఏకీకృతం చేసి ఒకేరకమైన శాంతి ప్రస్థాపన చేయడమే పీఠం ధ్యేయం. ‘యశస్సు’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో స్వయంగా పర్యటిస్తూ… భజనలు, కీర్తనలు చేయించడం, భాగవతాది ప్రవచనాలు చెప్పడం చేస్తున్నాం. ఇవన్నీ నా ఆత్మోద్ధరణ ద్వారా సామాజిక చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నంలో భాగమే.
ఆదిశంకరులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతాన్ని ఈ తరం వాళ్లు.. ఆధునిక జీవనశైలికి ఎలా అన్వయించుకోవాలి?
అద్వైతం అంటే రెండోది లేదని! పంచభూతాత్మకమైన జగుత్తులో.. పంచభూతాత్మకమైనది కానిది ఏదైనా ఉంటే.. అది రెండోది అవుతుంది. ప్రతి వస్తువూ పంచభూతాత్మకమైన జగత్తే కనుక.. దీని ఆధారంగా ఏదైతే నడుస్తున్నదో అది లౌకిక జగత్తు. ఆ పంచభూతాత్మకమైన జగత్తుకు ఆధారం ఏదైతే ఉందో.. అది పారలౌకికం. దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి ప్రక్రియనూ పరమాత్మ సేవ అనే భావనతో చేయాలి. పరమాత్మ ఎవరు? అన్నప్పుడు.. ఎవరికి వారు తామే అన్న భావన రావాలి. అదే అద్వేతం. వేదవేదాంగాలు, శాస్త్ర పురాణాలు చదివిన వారు అద్వైత భావనను అన్వయించుకోగలరు. ఇవేవీ చదవని వారు కూడా తెలియకుండానే అద్వైతాన్ని అనుసరిస్తున్నారు. అది ఎలాగన్నది తెలుసుకునే ప్రయత్నమే సాధన. ఆ పరమాత్మ శక్తి నాలో ఉన్నదని అనుకోకుండా.. ఆ పరమాత్ముని శక్తి నాతో ఈ పని చేయిస్తున్నదన్న భావన కలగాలి. అప్పుడు ప్రతివాడూ అద్వైతే!
భక్తికి-ఆధ్యాత్మికతకు, భక్తుడికి- సాధకుడికి మధ్య వ్యత్యాసం ఏమిటి?
ఆధ్యాత్మికత వేరే, భక్తి వేరే అని కాదు. ఈ రెండూ ఒకటే. భక్తి ఉండాలి, ఆధ్యాత్మిక సాధన సాగాలి. భక్తి అంటే అంకిత భావం, ప్రేమ భావం. ఈ ప్రేమ స్వరూపాన్ని పొందే ప్రయత్నమే సాధన. భక్తి లేని ఆధ్యాత్మికత వృథా. ఆధ్యాత్మికత లేని భక్తి పనికిరాదు. ఆధ్యాత్మికత అంటే పూజలు, గ్రంథాల పఠనం కాదు, ఏదైతే మన అంతరాత్మకంగా, అధిదైవంగా ఆత్మస్వరూపంతో ఉందో అదే ఆధ్యాత్మికత. మనం చేసే ప్రతి ప్రయత్నమూ సాధనే!
ఆధ్యాత్మిక సాధన ఆసక్తి ఉన్నవారు గురువును ఎలా ఎంచుకోవాలి? గురువు అనుగ్రహం పొందాలంటే శిష్యుడు ఎలాంటి నియమాలు పాటించాలి?
గురువును అన్వేషించడంలో రెండు రకాల వ్యవహారాలు ఉన్నాయి. ఉత్తమమైన శిష్యుడు ఉంటే… గురువే అన్వేషిస్తూ వస్తాడు. సదానంద పరంపరలో, ఆదిశంకరుల చరిత్రలో ఇలాంటి సందర్భాలు కనిపిస్తాయి. ఇక గురువును అన్వేషిస్తూ శిష్యుడు వెళ్లడం గురు సంప్రదాయంలో చాలాచోట్ల చెప్పే విషయం. గురువును అన్వేషించే క్రమంలో వారిని పరీక్షించుకోవాలి. అలాగని పరీక్షలు పెట్టమని కాదు. ‘నా సందేహాలు తీర్చే గురువు కావాలి’ అన్న భావనతో ఈ అన్వేషణ సాగాలి. గురువును ఆశ్రయించిన తర్వాత ఆయన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. అంటే సందేహాలు అడుగొచ్చే కానీ, పరీక్షించే ప్రయత్నం చేయొద్దు. ‘పరిప్రశ్నేన సేవయా’ సేవచేస్తూ, గురువును అనుసరిస్తూ సందేహాలు నివృత్తి చేసుకోవాలి. గురువు చెప్పినట్టు చేయాలి కానీ, ఆయనలా చేసే ప్రయత్నం చేయొద్దు. అది దుష్కరమైన కార్యం. గురువును అనుసరించాలే కానీ, అనుకరించొద్దు! వారి స్థాయిని తగ్గించకూడదు!!
గురు ముఖతః మంత్రోపదేశం పొందలేని వాళ్లు ఏదైనా మంత్ర సాధన చేయాలంటే ఏ పద్ధతిని పాటించాలి?
అందరూ మంత్రోపదేశం పొందాలని ఎక్కడుంది?! ఎవరెవరి స్థాయికి తగ్గట్టు వారికి అనుగ్రహం ఉంటుంది. కర్మభూమి, వేదభూమి అయిన మన భారతావనిలో జన్మించాడంటే వాడికి మంత్రోపదేశం ఉన్నట్టే! గురు ముఖతః మంత్రం పొంది, సవిధిగా వెళ్తూ మంత్రానుష్ఠానం చేసి, సాధన ద్వారా ముక్తిని పొందడం ఒక పద్ధతి. గురు ముఖతః మంత్రం పొందలేనప్పుడు.. మనసులోనే పరమాత్మను ధ్యానం చేస్తూ.. సన్మార్గంలో నడవడం రెండో పద్ధతి. ‘కలౌ స్మరణాన్ ముక్తిః’ నామోపాసన వల్ల… ప్రతివాడూ మోక్షాన్ని పొందవచ్చు. కొంతసేపు ఆ ధ్యానం, కొంతసేపు ఈ నామం పఠిస్తానంటే కుదరదు. బలంగా విశ్వసించి నమ్మకంగా చేయాలి. కర్మజీవులు ఉంటారు. వారికి మంత్రానుష్ఠానం సాధ్యం కాకపోవచ్చు. మనస్ఫూర్తిగా గోవిందా అన్నా.. వారు నామస్మరణ చేసినవారు అవుతారు. చేయగలిగే వెసులుబాటు ఉన్నవాళ్లు కూడా గోవిందా అంటానంటే కుదరదు. ముఖ్యంగా తల్లిదండ్రులు సూచించిన మార్గంలో పయనిస్తూ సాధన కొనసాగించాలి.
నేటి సమాజంలో కోర్కెలు తీరితే మొక్కులు చెల్లించడం, ఫలితం రాకపోతే వెళ్లే గుడిని, దేవుణ్నీ కూడా మార్చేస్తున్నారు. దీనిని ఎలా చూడాలి?
ఈ విషయంలో సమాజాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అన్ని రకాల మనుషులు సమాజంలో ఉంటారు. ‘ఆర్తో జిజ్ఞాసురర్థారీజ్ఞానీచ భరతర్షభ’ అన్నాడు గీతాచార్యుడు. ‘దుఃఖం నుంచి విముక్తి పొందడానికి, సంపదలు, కీర్తి కోరేవాడు, భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలవాడు, మోక్షాన్ని ఆశించేవారు’ ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. కోరిక తీరగానే భగవంతుడిని మార్చుకుంటున్నాడన్న లక్షణానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనిలేదు. ఆ వ్యక్తి ‘భగవంతుడే లేడు’ అన్నప్పుడు మనం ఆలోచించాలి. రూపాలు వేరైనా భగవంతుణ్నే ఆశ్రయిస్తున్నాడు కదా, అది చాలు! కోరికలతో ఉన్న భక్తుడు.. తాను అనుకున్నది నెరవేరితే మొక్కులు చెల్లిస్తానంటాడు. ఆ కోరిక నెరవేరితే మొక్కు చెల్లిస్తాడు. లేదంటే లేదు. ఈ క్రమంలో ఏడుకొండలవాడికి మొక్కు చెల్లించాను, ఏడుకొండలవాడికి మొక్కు చెల్లించను అన్నా.. రెండు సందర్భాల్లోనూ ఆ దైవాన్ని అయితే తలుస్తున్నాడు కదా! భగవత్ సేవలో ఉపాధి మారడం ప్రాధాన్యాంశం కాదు. కులదైవం, ఇష్టదైవం, వంశదైవం ఇవన్నీ ఉన్నాయిగా! ఇష్టదైవం మారిందంతే! కేదార్నాథ్ వెళ్లినప్పుడు ఈశ్వరుడికి దండం పెడుతున్నాం. బదరీనాథ్‌కు వెళ్లి నారాయణుణ్ని కొలుస్తున్నాం. అంతమాత్రాన భక్తిలో వైక్లబ్యం ఉందనుకుంటే ఎలా?! ఆస్తికత మారనంత వరకు వచ్చిన ప్రమాదం ఏదీ లేదు!!
సాధకులకు సైతం మనసు స్థిమితంగా ఉండదు కదా! ఆ మనసును కట్టడి చేసే మార్గం ఏమిటి?
సాధన ఎవరికి అవసరం? ఏదైనా సాధించడానికి, పరమాత్మ మార్గాన్ని పొందడానికి అవసరం. ఆధ్యాత్మిక సాధనలో అవరోధాలు రాకుండా ఉండవు. ఇదేమీ నల్లేరు మీద బండి నడకలా ఉండదు. మనసు లక్షణమే చంచలం. దాని గురించి మనం బాధపడాల్సిన పనిలేదు. చంచలమైన మనసు వెంట మనం పరుగులు తీయకపోతే అదే ఊరుకుంటుంది. ముందు దాని వెంట పడటం మానేయాలి. మనసును ఆశాపాశాల వెంట తిప్పితే అది మనల్ని కిందికి లాగేస్తుంది. దాన్నుంచి వెనక్కి రావాలంటే.. అంతకన్నా గొప్పదాన్ని మనసుకు చూపించాలి. గది నుంచి వెలుపలికి వెళ్లే చిన్న దారిని ఉంచాకే, ఆ గదిలో ఉన్న పిల్లిని బయటికి వెళ్లగొట్టే ప్రయత్నం చేయాలి. ఏ దారి లేకుండా వెళ్లగొడతానంటే పిల్లే పులిలా మన మీద పడుతుంది. అలాగే, మనసుకు ఒక మార్గం చూపించి దానిని కట్టడి చేయాలి. అదే నామం, అన్నదానం, సేవ! ఇవన్నీ చేస్తూ మనసును అదుపు చేయాలి. ‘లాలయేత్ చిత్త బాలకం’ పిల్లవాడు ఏనుగు కోరితే చిన్న బొమ్మ ఇచ్చి సర్ది చెబుతాం కదా! అదేవిధంగా చంచలమైన మనసును నామం ద్వారానో, మంత్రం ద్వారానో, ఉపాసన ద్వారానో దారికి తెచ్చి ఆ మనసును భగవత్ చరణాలకు సమర్పించేలా ప్రయత్నించాలి. అదే
సాధకుల లక్ష్యం కావాలి. శాస్త్రం ఏం చెప్పినా.. శాస్త్రం చెప్పిన విషయాలన్నిటికీ హేతుబద్ధత అపాదించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, హేతుబద్ధత లేని ఏ అంశమూ మన శాస్ర్తాల్లో లేదు. అనుభవంలోకి రాలేదు కాబట్టి నమ్మను, లేదు అనుకోవడం తప్పు. అయితే, శాస్త్రం చెప్పిన ప్రతి విషయమూ హేతువుతో కూడుకున్నదే! వాటిని విశ్లేషించి అందించగలిగే పరిస్థితులు రావాలి. ఆ విధమైన పరిజ్ఞానం కలిగిన మహనీయులను భగవంతుడు మనకు ప్రసాదించాలని కోరుకుందాం!
‘అందరిలో పరమాత్మను దర్శించాల’ని మదనానంద సరస్వతీ స్వామివారి ఉపదేశం. ‘అనుకున్నది సాధించాలన్న’ది కృష్ణానందస్వామి మాట. వీటిని ఆధారంగా చేసుకొని మన పీఠం ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రంగంపేట, తొగుట, బసవకళ్యాణ్, కాశీ ఇలా నలభై ఆశ్రమాలు ఉన్నాయి. భగవత్ ప్రేరణ ఆధారంగా మా కార్యక్రమాలు సాగుతుంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులను పోషించాలి, అన్నదమ్ములు కలిసి ఉండాలి, కూర్చొని భోజనం చేయాలి ఇలా సంప్రదాయ పరిరక్షణకు మార్గ నిర్దేశనం చేస్తున్నాం.
ఒకసారి రుద్రం చెబితే సకృతావర్తం అంటారు. పదకొండుసార్లు చెబితే ఏకాదశం, 121 సార్లు చెబితే శత రుద్రం. అలా 121 రుద్ర పారాయణాలు 11సార్లు చేస్తే మహారుద్రం. అలాంటి మహారుద్రాలు 11 సార్లు చేస్తే అతిరుద్రం అని నిర్వచనం. కోటి రుద్ర పారాయణల్లో భాగంగా మన ప్రాంతంలోని ప్రముఖ క్షేత్రాల్లో తరచుగా మహారుద్రం నిర్వహిస్తున్నాం. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, అసోం రాష్ర్టాల్లోనూ విరివిగా రుద్రాలు జరుగుతున్నాయి. నేపాల్లోనూ చేస్తున్నారు. కానీ, మనం భారతదేశానికే పరిమితం కావడం వల్ల.. వారిని అతిథి భాగంగా భావిస్తున్నాం. కోటి సంఖ్యకు అతి చేరువగా ఉన్నాం.