Sreeleela | కన్నడ సినిమాలతో కెరీర్ ప్రారంభించి, టాలీవుడ్లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీలీల ప్రస్తుతం తన కెరీర్లో కీలక దశను ఎదుర్కొంటోంది. ప్రారంభంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని టాప్ హీరోయిన్ రేసులోకి వచ్చిన ఆమె… ఇప్పుడు మాత్రం వరుస ఫలితాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాతో శ్రీలీల టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా… ఆమెకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా, ఇండస్ట్రీలో ఆమెకు వరుస అవకాశాలు రావడం విశేషం.
రవితేజ సరసన నటించిన ‘ధమాకా’ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో శ్రీలీల కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. ఆ విజయంతో ఆమె టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వరుసగా అరడజను సినిమాలు ఆమె చేతిలో పడగా, కొన్నింటి ఫలితాలు నిరాశపరిచాయి. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, పెద్ద హిట్ మాత్రం ఆమెకు దక్కలేదు. ‘పుష్ప 2’లో చేసిన ప్రత్యేక డాన్స్ నంబర్‌తో ఇతర భాషల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమెకు తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో అవకాశాలు కూడా వచ్చాయి.
తమిళంలో చేసిన ‘పరాశక్తి’ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీంతో అక్కడ ఆమెకు ఆశించిన గుర్తింపు రాలేదు. ఇక హిందీలో అనురాగ్ బసు దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆలస్యం అవుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇటీవల వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ సరసన నటించినా… సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. అదే సమయంలో గత ఏడాది వచ్చిన సినిమాలు కూడా కమర్షియల్‌గా పెద్ద విజయాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుతం తెలుగులో పెద్దగా ప్రాజెక్టులు లేకపోవడంతో, శ్రీలీల తన భవిష్యత్తును బాలీవుడ్ సినిమాపైనే ఆధారపెట్టినట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ సంవత్సరం శ్రీలీల కెరీర్‌కు అత్యంత కీలకం. కనీసం ఒకటి రెండు హిట్స్ సాధిస్తేనే ఆమె మళ్లీ టాప్ రేసులోకి రావచ్చని అంటున్నారు.