వాషింగ్టన్: ఇండియా, చైనా దేశాలను నరకకూపాలతో పోల్చారు అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్. ఆయన రాసిన ఓ లేఖను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు. సావేజ్ నేషన్ పేరుతో ఉన్న ఓ వీడియోను కూడా ఆయన తన పోస్టులో పెట్టారు. జన్మహక్కు పౌరసత్వం గురించి మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్ధిస్తూ ఆ పోస్టు చేశారు. ఇండియా, చైనా దేశాలు నరకకూపాలు అంటూనే.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను వదిలేస్తారని, ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారని సావేజ్ తన లేఖలో విమర్శించారు. ఆ వర్ణవివక్ష లేఖను ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో షేర్ చేయడం వివాదాస్పదం అవుతున్నది.
ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తప్పుపడుతూ మైఖేల్ సావేజ్ తన లేఖలో రాశారు. జన్మతహ పౌరసత్వం అంశంపై ప్రస్తుతం అమెరికాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో ఆ కేసుపై విచారణ కూడా జరుగుతున్నది. వలసదారులు(ఇమ్మిగ్రాంట్స్) జన్మతహ పౌరసత్వ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని సావేజ్ తన లేఖలో ఆరోపించారు. నేరుగా ఆయన భారత్ దేశాన్ని ప్రస్తావించారు. అమెరికాలో స్థిరపడేందుకు కొన్ని కుటుంబాలు పౌరసత్వం మార్గాన్ని వాడుతున్నాయన్నారు. బేబీని డ్రాప్ చేసేందుకు అమెరికా వస్తారని, పిల్లోడు పుట్టిన తర్వాత ఇక చైనా లేదా ఇండియానో ఇక ఏదో నరకం నుంచి మొత్తం కుటుంబం వచ్చేస్తుందని అన్నారు.
ఉద్యోగం కావాలంటే నువ్వు ఇండియానో లేక చైనావాడివై ఉండాలని, ఎందుకంటే అంతర్గత మెకానిజం మొత్తం ఇండియన్లు, చైనీయులతో నిండి ఉంటుందని సావేజ్ తన లేఖలో రాశారు. అయితే ఆ లేఖను ట్రంప్ షేర్ చేయడం.. ప్రత్యక్షంగా ఇండియా, చైనాను తప్పుపట్టినట్లుగా ఉంది.