Delhi Airport : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Idiragandhi International Airport) లో ఇవాళ సాయంత్రం రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. విమానాలు ఒకదానికొకటి స్వల్పంగా ఢీకొనడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ విమానాలు ఏమాత్రం వేగంగా ఢీకొన్నా భారీగా ప్రాణనష్టం జరిగేది. ట్యాక్సీ వేపై ఆకాశ ఎయిర్ (Akasa Air), స్పైస్‌జెట్ (SpiceJet) కు చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విమానాశ్రయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ బీ737-700 విమానం ట్యాక్సీయింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో హైదరాబాద్‌కు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఆకాశ ఎయిర్ విమానం అక్కడ నిలిపి ఉంది. వేగంగా వస్తున్న స్పైస్‌జెట్ విమానం కుడి రెక్క నిలిపి ఉన్న ఆకాశ విమానం తోక భాగంలోని స్టెబిలైజర్‌ను తాకింది. దాంతో రెండు విమానాల భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై ఆకాశ ఎయిర్ వెంటనే స్పందించింది.
తమ విమానం ఆగి ఉన్నప్పుడు మరో విమానం వచ్చి ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలిసిందని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది అందరినీ సురక్షితంగా విమానం నుంచి దించామని, హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా దెబ్బతిన్న రెండు విమానాలను అధికారులు పరిశీలన కోసం బేకు తరలించారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరిపే అవకాశం ఉంది.