దయ్యాలున్నాయా? ఉన్నాయని నమ్ముతూ ఉలిక్కిపడేవాళ్లు ఉన్నారు.అదంతా భ్రమ, బూటకం అని వాదించేవాళ్లూ ఉన్నారు. దేవుడు ఉన్నాడని మీరు నమ్మితే .. దయ్యాలు కూడా ఉన్నాయని నమ్మితీరాలని కొందరు వాదిస్తుంటారు. మరి వైద్యరంగ నిపుణులు ఏమంటున్నారు? దయ్యాల గురించి వారి మనోగతం ఏమిటి?అది బలమా? బలహీనతా? మూఢనమ్మకమా? మనసు చేసే ఇంద్రజాలమా?
దేవుడు.. దయ్యం.. దాదాపుగా అన్ని మతాలు ఒకదాన్ని మంచికి, రెండోదాన్ని చెడుకు చిహ్నంగా భావిస్తాయి. ఈ రెండిటి ఉనికిని బలంగా నమ్మేవాళ్లు ఉన్నట్టే, దానిని వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు. చనిపోయిన మనవారి ఆత్మలు మన మధ్యే తిరుగుతూ ఉంటాయని చెప్పేవాళ్లు, వాళ్లతో సంభాషించామన్న వాళ్లు మనకు ఎదురుపడుతుంటారు. కానీ, హేతువాదులు దీనిని నిర్దంద్వంగా కొట్టిపారేస్తారు. సైన్సు, ఆత్మపైన నమ్మకం అనేవి కలిసి ప్రయాణించవు. ఆత్మలు ఉన్నాయా అనే అంశానికి సంబంధించిన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు దయ్యాలకు సంబంధించి వైద్యరంగంలో వివిధ రంగాలకు చెందిన నిపుణుల అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయి.
నిద్ర పక్షవాతం.. (స్లీప్ పెరాలసిస్) అన్నమాట మీరెప్పుడయినా విన్నారా? దాదాపు 20 శాతం మంది జీవితంలో ఏదో ఒక దశలో దీని ప్రభావానికి లోనవుతారు. హఠాత్తుగా మీకు నిద్రలో మెలకువ వస్తుంది. అటూ ఇటూ కదలలేకపోతారు. ఈ సమయంలో కొందరికి దయ్యాన్ని చూసిన అనుభవం కలుగుతుందని చెబుతున్నారు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బలాండ్ జలాల్. “నిద్రలో రెమ్ స్లీప్ అనేది ఒక దశ.
ఈ దశలో మనకు స్పష్టమైన కలలు వస్తాయి. వాటిని కాపాడుకోవటానికి మనం పక్షవాతం లాంటి స్థితికి చేరుకుంటాం” అంటారు జలాల్. “మీరు ఈ సమయంలో గనక నిద్రలేస్తే, మీరు చూడగలుగుతారు, వినగలుగుతారు గానీ శరీరాన్ని అటూ ఇటూ కదపలేరు. ఈ దశలో 40 శాతం మంది ఆయా అంశాలను చూడగలుగుతారని మా పరిశోధనలో స్పష్టమైంది.
ఈ స్థితిలో అసాధారణమైనవి, ఊహించని వాటికి ఓ అర్థం కల్పించాలని మెదడు ప్రయత్నిస్తుంది. మీ కాళ్లు చేతులు కదపమని, మన పరిసరాల్లో అదెక్కడ ఉందో చూడమని సంకేతాలను పంపుతుంది. దానికి వెంటనే కావాల్సిన ఫీడ్‌బ్యాక్ రాకపోవటంతో, మెదడులో ఉండే మిర్రర్ న్యూరాన్లు అనే కణాలు జరుగుతున్న దాన్ని చిత్రాలుగా గీయడం ప్రారంభిస్తాయి. ఈ గందరగోళంలో మన ముందున్న చిత్రాన్ని రకరకాలుగా ఊహించుకుంటారు” అంటారు జలాల్.
ఇలాంటి పరిస్థితుల్లో… “కొంతమంది దాన్ని శరీరం బయట చోటుచేసుకున్న అనుభవంగా చూస్తారు. ఇంకొంతమంది మంచం మీద ఉన్న తమను తాము చూసుకుంటారు. మరికొంతమంది మాత్రం దయ్యాన్ని చూశామని చెబుతారు” అని జలాల్ వివరిస్తారు. ఈ నిద్ర పక్షవాతానికి చికిత్స చేయటం సులభమే అంటారాయన. స్లీప్ పెరాలసిస్‌కు గురైనప్పుడు ముందుగా కళ్లు మూసుకోవాలి. అప్పుడు మిర్రర్ న్యూరాన్లు చిత్రాన్ని సృష్టించలేవు. అది లేకపోతే దయ్యం భావనను అనుభూతి చెందడం ఇక ఎంతమాత్రం సాధ్యం కాదంటారు జలాల్.
మబ్బుల్లో… గోడలపై…
ఎప్పుడైనా ఆకాశంలో మేఘాన్ని చూసినా, ఏదైనా భవనాన్ని చూసినా అందులో మీకు ముఖం కనిపిస్తే, మీరు దయ్యాలను చూశామని చెప్పటానికి ఆస్కారం ఉంటుంది. దానిని ‘పెరొడిలియా’ అంటారు. యాదృచ్ఛికతల నుంచి నమూనాలను సృష్టించే సామర్థ్యం అది. ఇది ఉన్నవాళ్లు దయ్యాలను ఎక్కువగా చూసే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన సైకాలజిస్టు టోబీ ప్రైక్ అంటున్నారు. “మనుషులు ముఖాలు చూడటానికి అలవాటుపడతారు. దాన్నుంచి వేగంగా సమాచారాన్ని స్వీకరిస్తారు.
మీరు గనక మంచి నమూనాల పరిశీలకులైతే, మీరు రూపాలను గానీ, ముఖాలను గానీ ఒక వ్యక్తిలా కాకుండా ఒక నీడలా చూడగలుగుతారు. మీ మెదడు అక్కడున్న ఖాళీలను భర్తీచేసి దాన్ని ఓ దయ్యంలా తయారుచేస్తుంది”. అయితే ఇలాంటప్పుడు కేవలం చూపు ఒక్కటే ప్రభావితం కాదు. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన దుర్హామ్ యూనివర్సిటీ పరిశోధకులు దీనికి సంబంధించి మరికొన్ని అంశాలను వెల్లడించారు. కొందరి మెదళ్లు యాదృచ్ఛికంగా వచ్చే శబ్దాలలో నుంచి నమూనాలను రూపొందించగలవట. అవి కొన్నిసార్లు భయం గొలిపేవిగా ఉంటాయి.
బూజే దయ్యమై..
భయానకమైన దృశ్యాలను కనుగొనటం వెనుక బూజు ప్రధాన పాత్ర పోషిస్తుందని యూకెలోని క్లార్క్సన్ యూనివర్సిటీకి చెందిన ప్లాంట్ పాథాలజిస్టులు చెబుతున్నారు. “ఇది నిజంగా ఆసక్తికరమైన అంశం. బూజువల్ల ఏర్పడే బయోటాక్సిన్లు మన ఆరోగ్యంపైన, మెదడుపైన ప్రభావం చూపుతాయి” అంటారు న్యూసౌత్‌వేల్స్ ప్లాంట్ పాథాలజీ, మైకాలజీ హెర్బానియం క్యూరేటర్ జోర్డార్ బెయిలీ. “యాస్పర్జిల్లస్ ఫూమిగేటస్ అనే ఫంగస్ మన ఆలోచనలు, మూడ్‌ను ప్రభావితం చేస్తుంది.
మనం చూసే, వినే విధానం అన్నిట్లోనూ మార్పులు తెచ్చే డ్రగ్ లాంటిది. కొన్ని పాత ఇండ్లలో వేసే పెయింట్లకు ఈ ఫంగస్ తేలికగా వ్యాపిస్తుంది” అంటారాయన. దీన్ని పీల్చటం వల్ల ఫంగస్ ప్రభావానికి లోనవుతారు. ఇతర లక్షణాలు కూడా తోడై మరిన్ని వ్యాధుల బారినపడతారు. వాళ్లు ఏది చూడాలనుకుంటే అదే చూస్తారు. ఎవరైనా బ్రెయిన్‌ఫాగ్, నిద్రలేమి, కుంగుబాటు తదితర సమస్యలతో బాధపడుతుంటే ఈ లక్షణాలు వారిపై మరింత ప్రభావం చూపుతాయి. మనం అలాంటి ఇండ్లలోకి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న బూజు వాసన పీల్చినప్పుడు దయ్యాలను చూశామన్న భావన కలుగుతుంది అనేది జోర్డార్ బెయిలీ వివరణ.
బంధాలు భూతాలుగా…
తమకు బాగా ఇష్టమైన వాళ్లు మరణించిన తర్వాత తిరిగి తమను కలుసుకోవటానికి వచ్చారని కొందరు చెబుతుంటారు. పరిశోధకులు దీనికి నాలుగు ‘ఆర్’లు కారణమని గ్రీఫ్ కౌన్సెలర్లు చెబుతున్నారు. ఇందులో మొదటిది.. రీ అష్యూరెన్స్. అంటే తాము బాగానే ఉన్నామని చనిపోయినవాళ్లు తమవాళ్లతో చెప్పుకోవటం.
రెండోది రిజాల్వింగ్… క్షమాపణ కోరటం లేదా తమకు సంబంధించిన ఏదైనా అంశాన్ని ముగించమని చెప్పటం. తర్వాతి రెండు… రీ ఎఫర్మింగ్ కనెక్షన్స్, రిలీజ్. అంటే బంధాలను పటిష్ఠం చేసుకోవటం, విముక్తి కోరుకోవటం. “ఇదంతా దుఃఖించే ప్రక్రియలో భాగం” అంటున్నారు సిడ్నీకి చెందిన గ్రీఫ్ కౌన్సెలర్ యూజినీ పెప్పర్. “ఒకళ్లను శాశ్వతంగా కోల్పోయాం అనేది మనం భరించలేం. కొన్నిసార్లు దాన్ని అంగీకరించడానికి అస్సలు మనసొప్పదు. అది వీల్లేనంత భారంగా మారుతుంది.
వాళ్లుపోయిన తర్వాత ఈ రకమైన భావనలతో మన బంధాలను పటిష్ఠపరుస్తూ మెదడు మనల్ని కాపాడుతూ ఉంటుంది. అసాధారణ కలయికలకు సంబంధించిన కథలు మనకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. దీని వెనక ఆధ్యాత్మిక కారణాలేవైనా ఉన్నాయేమో అనిపిస్తాయి” అంటారు యూజినీ పెప్పర్. దీనికి వివరణగా ఆయన సైకాలజీలో ఓ ప్రయోగాన్ని ప్రస్తావిస్తారు. “మనం ఏదైనా ఆట ఆడుతుంటే… అందులో లీనమైపోతాం. మధ్యలో ఏదైనా జంతువు ప్రవేశించడమో, ఏదైనా సంఘటన జరగడమో అస్సలే గమనించం. దయ్యాల విషయమూ అంతే.. మనం గట్టిగా చూడాలనుకుంటే కనిపిస్తాయేమో’’ అంటాడు యూజినీ.
Ghost Voice Sound Effect
వినిపించని శబ్దాల్లో…
ఇరవై హెడ్జ్ కంటే తక్కువ ధ్వనులను పరశ్రావ్యాలు అంటారు. వీటిని మన చెవి వినలేదు. కానీ, వీటివల్ల మన శరీరానికి అసౌకర్యం కలుగుతుంది. తల తిరగటం, మైకం కమ్మటం, భయాందోళనలు కలగటం వంటివి సంభవిస్తాయి. 1990లో పరశ్రావ్యాలు దయ్యాలతో ముడిపడి ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. బ్రిటిష్ ఇంజినీర్ విక్ టాండీ ప్రయోగశాలలో ఉన్నప్పుడు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. ఆ సమయంలో ఒక రూపాన్ని చూశాడు, కానీ అదేంటో మాత్రం వివరించలేకపోయాడు.
ఇది చాలా వివాదాస్పదమైన ఆలోచన. “నేను చాలా కాలంగా పరశ్రావ్యాలపైన అధ్యయనం చేస్తున్నాను. ఎన్నో అంశాల్లో వినిపించని ధ్వనులను నిందిస్తూ ఉంటారు. కానీ, నిజానికి ఈ పరిస్థితికి ఇతర అంశాలు కూడా తోడవుతాయి” అంటున్నారు ఆస్ట్రేలియన్ ఎకౌస్టిక్ సొసైటీకి చెందిన శబ్ద నిపుణుడు నార్మన్ బ్రోనర్.
పరశ్రావ్యాల ప్రభావానికి గురైనప్పుడు ప్రజల అనుభూతుల్లో మార్పులు వస్తాయనేది అనేక పరిశోధనల్లో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ హార్ట్ఫోర్డ్షైర్కి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ వైజ్మన్ చేపట్టిన అధ్యయనంలో పరశ్రావ్యాల స్థాయితో రూపొందించిన మ్యూజిక్ వినటం వల్ల దాదాపు 22 శాతం మందిలో తీవ్ర అసౌకర్యం కలిగిందని వెల్లడైంది. ఇది ఎందుకు సంభవిస్తుందో చెప్పటానికి కూడా కారణాలున్నాయి. జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధనలో పరశ్రావ్యాలు మెదడులో ఒత్తిడికి, భయానికి కారణమయ్యే అమిగ్డాలాను రెచ్చగొడతాయని తేలింది.
“అలాగే ఈ శబ్దం ప్రభావం వల్ల తలలోనూ, మెదడులోనూ కంపనాలు ఏర్పడతాయి. అది దృష్టిలోపాన్ని కలిగించవచ్చు. దానివల్ల అసాధారణమైన దృశ్యాలు చూశానన్న భావన కలుగుతుంది” అంటారు ప్రొఫెసర్ వైజ్మన్. “మీరు ఒక ఆధునిక భవంతిలోకి వెళ్లారు. హఠాత్తుగా మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది. అది కొత్తది కాబట్టి మీరు దాని గురించి అంతగా పట్టించుకోరు. అదే మీరు ఒక పాత భవంతిలోకి వెళ్లి ఇలాంటి భావనను ఎదుర్కొన్నప్పుడు, కచ్చితంగా దయ్యం అనే అనుకుంటారు” అంటాడు వైజ్మన్.
టాప్ హారర్ బుక్స్ ఇవీ
1. ద షైనింగ్ ( స్టీఫెన్ కింగ్)
2. ఫ్రాంకెన్‌స్టీన్ (మేరీ షెల్లీ)
3. ఇట్ (స్టీఫెన్ కింగ్)
4. ద స్ట్రేంగ్లర్ (విలియం లాండే)
5. ఘోస్ట్ స్టోరీ (పీటర్ స్ట్రాబ్)
6. డ్రాకులా (బ్రామ్ స్టోకర్)
7. ద టెర్రర్ ( డ్యాన్ సిమన్స్)
8. క్యారియన్ కంఫర్ట్ (డ్యాన్ సిమన్స్)
9. ద హౌస్ ఎక్రాస్ ద లేక్ బై రిలే సాగర్ (టాడ్ రిట్టర్)
10. సమ్‌థింగ్ విక్డ్ దిస్ వే కమ్స్ (రే బ్రాడ్బరీ)
మన ఆలోచనలే దయ్యాలు…
దయ్యాలు ఉన్నాయని బలంగా నమ్మేవారు, వాటిని చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం. దానితోపాటు మరికొన్ని లక్షణాలు కూడా వారిలో ఉంటాయని అంటారు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టు నీల్ డేగ్నల్. ఇలాంటివారికి ఆయన ‘దయ్యాలతో అనుభవం ఉన్నవారు’ అని పేరుకూడా పెట్టాడు. “వాళ్లు ఏ విషయంలోనూ అస్పష్టతను, సందిగ్ధతను భరించలేరు. అసాధారణ సంఘటనలను, భావనలను విడిచిపెట్టరు. వాటికి పరిష్కారం కనుగొనాలనే ప్రయత్నిస్తారు. మిగతావారితో పోలిస్తే ఊహల్లోనూ, సృజనాత్మకతలోనూ వాళ్లు మేటిగా ఉంటారు. మామూలు సంఘటనలు భయానకంగా మారడానికి అవి కారణమవుతాయి” అని ఆయన చెప్పాడు.
దయ్యాలు కనబడటానికి ఒంటరితనం కూడా కొంత కారణమవుతుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో లాక్డౌన్ సమయంలో ఈ రకమైన ఫిర్యాదులు వచ్చాయి. అలాగే న్యూయార్క్‌లోనూ అలాంటి వాతావరణమే కనిపించింది. అలా ఎందుకని ‘న్యూయర్క్ టైమ్స్’ సైకాలజిస్టులను వివరణ కోరింది. దీనికి విపత్తు వల్ల ఏర్పడిన ఒత్తిడి, ఒంటరితనమే కారణమని అమెరికాకు చెందిన ప్రముఖ మనస్తత్వ నిపుణుడు ప్రొఫెసర్ కుర్త్ గేరీ చెప్పుకొచ్చారు. “మీరు నాలుగు గోడల మధ్య బందీగా ఉన్నప్పుడు, మనుషుల సహచర్యం కోరుకుంటున్నప్పుడు ఓ అతీంద్రియ శక్తి మీ వెంట ఉందనే ఆలోచన మీకు సాంత్వనను ఇస్తుంది. అది దైవమా, దయ్యమా అనేది మన ఆలోచనలకు అనుగుణంగా ఉంటుంది” అని కుర్త్ గేరీ అభిప్రాయం.
దేవుడి బాధ్యత
Hindu Maha Mantra Omkaram
వాళ్లు ఏ మతానికి చెందిన వారైనా దయ్యాల నుంచి రక్షించే బాధ్యతను దేవుడు తీసుకుంటాడని నమ్ముతారు. ఆయుష్షు తీరకుండానే చనిపోయిన వారి ఆత్మలు దయ్యం రూపంలో తిరుగుతాయనే అభిప్రాయం ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఎవరైనా చనిపోతే ఒక ఏడాదిపాటు వారి ఆత్మ ఘోషిస్తూనే ఉంటుందని నమ్ముతారు. బైబిల్లో దయ్యాన్ని సాతాను, లూసిఫర్గా వ్యవహరిస్తారు. లూసిఫర్ అనే దేవత.. దేవుడి సన్నిధిలో ఉంటూ దూతలకు అధికారిగా ఉండేది. దేవుడి తర్వాత అందరూ తననే గౌరవిస్తారనే అహం దానికి తలెకెక్కుతుంది. దాంతో దానిని దేవుడు పాతాళానికి తోసివేశాడనే కథ ప్రచారంలో ఉంది. ఇస్లాం మతంలోనూ దయ్యాలపైన నమ్మకాలు ఉన్నాయి. సైతాను రెండు కొమ్ముల మధ్య నుంచి సూర్యుడు ఉదయిస్తాడు. నమాజు చేసేవాని ముందు నడిచేవాడు దయ్యం లాంటివాడు అన్న ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి.
హాలీవుడ్లో దయ్యాల హవా
దయ్యాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలకు ఉన్నంత గిరాకీ మిగిలిన జానర్లకు కనిపించదు. అందుకే దర్శక నిర్మాతలు హారర్ సినిమాలు తీసి ప్రేక్షకులను భయపెట్టటానికి ఆసక్తి చూపుతారు. హాలీవుడ్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఏడాదీ ఈ తరహా సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులకు థ్రిల్ చేస్తూనే ఉన్నాయి. 1995 నుంచి అమెరికా, కెనడాలలో వాటి మార్కెట్ రెట్టింపు అవుతూ వస్తున్నది.
అది క్రమంగా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. దీంతో మరింత ఉత్కంఠ రేపే స్క్రిప్టుల కోసం దర్శకులు పరుగులు పెడుతున్నారు. ఒక్క ఏడాదిలో ఈ తరహా చిత్రాలు 46 రూపుదిద్దుకున్నాయంటే దయ్యాల సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. దాదాపు 798 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టాయి. భారీ సెట్టింగులు, విదేశీ లొకేషన్లతో పని లేకపోవటం, తక్కువ బడ్జెట్‌తో సినిమా పూర్తికావటం వంటి అనుకూలతల వల్ల తెలుగులోనే కాదు ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఈ తరహా చిత్రాలు ఎక్కువగానే వస్తున్నాయి.
హాలీవుడ్లో మొట్టమొదటి హర్రర్ చిత్రం ‘ద హాంటెడ్ కాజిల్- (ద హౌస్ ఆఫ్ ద డెవిల్)’ 1896లో విడుదలైంది. జార్జి మెల్లిస్ దీన్ని రూపొందించాడు. అప్పటివరకూ ఉన్న పుస్తకాలు, నాటకాలు, చరిత్ర ఆధారంగా పాత్రలకు రూపకల్పన చేశాడు. 1957లో వచ్చిన ‘ద కర్స్ ఆఫ్ ఫ్రాంకెన్‌స్టీన్’ చిత్రం రంగుల్లో రూపుదిద్దుకున్న తొలి హారర్ చిత్రం. దీనికి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. హాలీవుడ్లో హారర్ చిత్రాలపై నిర్వహించిన సర్వేలో ‘ఎగ్జార్సిస్ట్’ (1973) చిత్రం మొదటి స్థానం దక్కించుకుంది.
ఒక చిన్నారికి దయ్యం పట్టటం, దానిని తరిమికొట్టడం ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు మాస్ హిస్టీరియాకు లోనయ్యారు. వాంతులు చేసుకోవటం, స్పృహతప్పి పడిపోవటం వంటివి సంభవించాయి. చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల బయట అంబులెన్సులను సిద్ధంగా ఉంచాల్సి వచ్చింది. ఆస్కార్ బెస్ట్ పిక్చర్‌గా నామినేట్ అయిన తొలి దయ్యాల చిత్రం కూడా ఇదే. భారత్‌లోనూ విడుదలైంది.
ఆ తర్వాత అది కలిగించిన దుష్పరిణామాల కారణంగా ‘ఎగ్జార్సిస్ట్’ ప్రదర్శనను నిషేధించారు. హెరిడిటరీ (2018), ద కంజూరింగ్ (2013), ద షైనింగ్ (1980), ద టెక్సాస్ చైన్సా మసాకర్ (1974), ద రింగ్ (2002), హలోవీన్ (1978), సిన్స్టర్ (2012), ఇన్సైడియస్ (2010), ఐటీ (2017) చిత్రాలు ఉత్తమ హారర్ సినిమాలుగా వరుస స్థానాలను ఆక్రమిస్తున్నాయి.
వారసత్వ లక్షణాల వల్లే..
హారర్ చిత్రాలను మనం బాగా ఇష్టపడటానికి వెనక సామాజిక, మానసిక కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన పూర్వికులు ఇతర జంతువులకు ఆహారం కాకుండా ఉండేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండేవాళ్లు. వాళ్ల పర్యవేక్షణ వ్యవస్థ నిశితంగా ఉండేది. ఈ భయానక చిత్రాలు చూస్తున్నప్పుడు మన స్పందన ఇలాగే ఉంటుందని హారర్ స్కాలర్ మాథిస్ క్లాజన్ చెబుతున్నారు. నిజజీవితంలో అలాంటి సందర్భం ఎదురైతే ఎలా వ్యవహరిస్తామో, సినిమా చూస్తున్నప్పుడు అదే రకమైన భావోద్వేగాలను ప్రదర్శిస్తామట. ఆందోళన కలిగించే సందర్భాలను ఎదుర్కోవటానికి అవసరమైన సన్నద్ధత దీనివల్ల లభిస్తుందని చెబుతున్నారు. మానవ జీవితంలో చీకటి కోణాలపై ఉండే ఆసక్తి కూడా ఇందుకు కొంత కారణమని నిపుణులు చెబుతున్నారు.
బాలీవుడ్… టాలీవుడ్
దర్శకుడు కమల్ అమ్రోహీ రూపొందించిన ‘మహల్’ చిత్రం భారతీయ చలన చిత్రరంగంలో తొలి హారర్ చిత్రంగా రికార్డు సాధించింది. అశోక్ కుమార్, మధుబాల ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతోనే మధుబాల, లతా మంగేష్కర్లు స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. రామ్సే బ్రదర్స్.. ఎఫ్.యు.రామ్సే కుమారులు, మనవళ్లు భారతదేశంలో హర్రర్ చిత్రాలకు చిరునామాగా నిలిచారు.
1980లలో వీసీఆర్‌లు ప్రవేశించి పైరసీలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఈ చిత్రాలతో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. దాదాపు 30 చిత్రాలు రూపొందించారు. వారి చిత్రాలన్నిటిలో దయ్యం పాత్ర పోషించిన నటుడు అజయ్ అగర్వాల్ తన పాపులారిటీని బాగా పెంచుకున్నాడు. హిందీ నటి బిపాసా బసు ఈ జానర్లో ఎక్కువ చిత్రాల్లో నటించి స్క్రీన్ క్వీన్‌గా నిలిచింది. మహేశ్ భట్, ముకేశ్ భట్ నిర్మాణ సారథ్యంలో ‘రాజ్’ పేరుతో వచ్చిన వరుస చిత్రాలకు విక్రమ్ భట్ దర్శకుడిగా ఉన్నారు.
హారర్ చిత్రాలపైన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఉన్న మక్కువ తెలియనిది కాదు. ఆయన భూత్ (2003), డర్నా మానా హై (2003), డర్నా జరూరీ హై (2006), డార్లింగ్ (2007), ఫూంక్ (2008), అగ్యాత్ (2009) తదితర చిత్రాలను రూపొందించాడు. ఇందులో భూత్, డర్నా మానా హై మాత్రమే ప్రేక్షకులను మెప్పించాయి. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ ఆత్మలు, దయ్యాల చుట్టూ పరిభ్రమించిన తెలుగు సినిమాలు ఎన్నో! దయ్యం అని భ్రమ కల్పించేలా స్క్రీన్‌ప్లే రన్ చేస్తూ నిర్మించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
‘ఆమె ఎవరు?’, ‘అర్ధరాత్రి’, ‘అవేకళ్లు’ తదితర సినిమాలు.. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలే అయినా, హారర్ జానర్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇటీవల కాలంలో తెలుగులో దయ్యాల సబ్జెక్టులు ఏటా అరడజను వరకు విడుదల అవుతున్నాయి. మనవాళ్లు ఎంతగా దయ్యాల చుట్టూ తిరుగుతున్నారంటే… చివరికి మనుషులను చూసి భయపడే దయ్యాల కథ కూడా సినిమా సబ్జెక్ట్‌గా ఎంచుకుంటున్నారు. ఆత్మలతో కామెడీ చేయిస్తున్నారు. హారర్ జానర్‌ను కామెడీతో మిక్స్ చేయడం వల్ల అటు హాస్యం పండక, ఇటు హారర్ జనరేట్ కాక.. చాలా సినిమాలు ఉస్సూరుమనిపిస్తున్నాయి.
దయ్యాలు కనబడటానికి ఒంటరితనం కూడా కొంత కారణమవుతుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో కొవిడ్ లాక్డౌన్ సమయంలో ఈ రకమైన ఫిర్యాదులు వచ్చాయి. అలాగే న్యూయార్క్‌లోనూ అలాంటి వాతావరణమే కనిపించింది. అలా ఎందుకని సైకాలజిస్టులను‘న్యూయర్క్ టైమ్స్’ వివరణ కోరింది. దీనికి విపత్తు వల్ల ఏర్పడిన ఒత్తిడి, ఒంటరితనమే కారణ మని అమెరికాకు చెందిన ప్రముఖ మనస్తత్వ నిపుణుడు ప్రొఫెసర్ కుర్త్ గేరీ చెప్పుకొచ్చారు.
హాంటెడ్ ప్లేసెస్.. దయ్యాల నెలవులు
దయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారంతో ప్రజలు కొన్ని ప్రాంతాలను సందర్శించటానికి భయపడతారు. అలాంటి ప్రదేశాలను హాంటెడ్ ప్లేసెస్ అని పిలుస్తారు. వాటిలో కొన్ని…
చాంగీ బీచ్: సింగపూర్
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యం ఊతకోచకు గురైన ప్రదేశం. ఇప్పటికీ అక్కడ ఇసుక మీద రక్తపు చారికలు కనిపిస్తాయని, ఆ ప్రాంతాన్ని సందర్శించే వారికి సైనికుల రోదనలు వినిపిస్తాయని చెప్పుకొంటారు.
మాంటె క్రిస్టో హోమ్‌స్టెడ్: ఆస్ట్రేలియా
న్యూసౌత్‌వేల్స్‌లోని జూనీ పట్టణంలో విక్టోరియా కాలం నాటి గృహంలో నాలుగు మరణాలు సంభవించాయి. అయితే వాళ్లు ఆ ప్రదేశాన్ని వదలలేదని ప్రచారంలో ఉంది. దయ్యాలు ఉన్నాయా అని తెలుసుకోవాలనే ఆరాటం ఉన్నవాళ్లు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
కెల్లీ కేజల్: మలేషియా
మలేషియాలోని ఐపో నగరానికి దగ్గరలో ఉన్న ఈ గృహంలో అద్భుతమైన శిల్పసంపద కనిపిస్తుందని అంటారు. ఈ ఇంటికి భూ గృహంకూడా ఉంది. ఆ ఇంటి యజమాని విలియం కెల్లీ స్మిత్, ఆయన ముద్దుల చిన్నకూతురుతోపాటు మొత్తం నాలుగు దయ్యాలు అక్కడ తిరుగుతున్నాయనే ప్రచారం ఉంది.
వల్కన్ హోటల్: న్యూజిలాండ్
ఒటాగోలోని సెయింట్ బాతన్స్లో ఉన్న ఈ హోటల్లో వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళ హత్యకు గురైంది. అప్పటినుంచి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతున్నదనే ప్రచారం ఉంది. ఈ హోటల్‌కి వచ్చిన మగ అతిథులను రాత్రి సమయంలో వేధించిందని చెప్పుకొంటారు.
నామ్ కూ టెర్రస్: హాంకాంగ్
గతంలో సైనిక వ్యభిచార గృహంగా ఉండేది. అప్పట్లో అనేకమంది మహిళలు బాధితులుగా మారారు. తర్వాత రోజుల్లో వాళ్లు ఇక్కడికి వచ్చేవాళ్లను పీడిస్తున్నారని చెప్పుకొంటారు. ప్రస్తుతం ఈ భవనాన్ని వదిలిపెట్టేశారు. పొరపాటున ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయిన స్కూలు విద్యార్థినులు కొందరికి తర్వాత మానసిక చికిత్స చేస్తే వారు కోలుకోకపోవటంతో దానికి భయానక ప్రదేశం అన్న పేరు స్థిరపడిపోయింది.
…? డాక్టర్ పార్థసారథి చిరువోలు