బంజారాహిల్స్,జనవరి 29: హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ కలిగిన రహదారులపై వేగంగా దూసుకొచ్చే వాహనాలను తప్పించుకుంటూ రోడ్డు దాటుతూ అనేకమంది పాదచారులు ప్రమాదాలకు గురి అవుతుంటారు. సిగ్నళ్లతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్డుదాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సుధీర్‌బాబు పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ప్రయోగాత్మకంగా పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ప్రధాన రోడ్డుపై పాదచారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో రోడ్డును దాటేందుకు వేచి ఉండే పాదచారుల కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించడంతో పాటు అవి అందరికీ కనిపించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్, శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్, బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద పెడస్ట్రియన్ ఐలాండ్స్‌ను మార్క్ చేస్తున్నారు.
వీటితో పాటు సిగ్నల్స్ వద్ద వేచి ఉండేవారు మాత్రమే ఇక్కడ నిలబడి ఉండేలా చూడాలని నిర్ణయించారు. సిగ్నల్ పడిన వెంటనే ముందుకు వెళ్లేలా వెయిటింగ్ ప్లేస్‌ను తీర్చిదిద్దనున్నారు. ప్రధాన కూడళ్లన్నింటిలో పెడస్ట్రియన్ ఐలాండ్స్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్న ట్రాఫిక్ అధికారులు ఫైలట్ ప్రాజెక్టులో భాగంగా పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాకా రోడ్డును ఎంపిక చేసుకున్నారు. రెండో దశలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45, బీవీబీ జంక్షన్, నీరూస్ జంక్షన్, బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని పెన్షన్ హౌస్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో కూడా పాదచారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. జంక్షన్లతో పాటు రద్దీ కలిగిన ప్రాంతాల్లో పాదచారులు రోడ్లను దాటేందుకు వీలుగా పెలికాన్ సిగ్నళ్లను ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ఇప్పటికే పెలికాన్ సిగ్నల్‌ను ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు మరికొన్ని ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
పాదచారుల భద్రత ముఖ్యం
రోడ్డు భద్రత అంటే కేవలం వాహనదారులకు సంబంధించిన విషయమే కాదు. రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే పాదచారులు కూడా క్షేమంగా వెళ్లే వాతావరణం కల్పించడం కూడా ముఖ్యం. దీనికోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేకంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద పెడస్ట్రియన్ ఐలాండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. గతంలోనే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పలు జంక్షన్ల వద్ద పాదచారుల కోసం ఐలాండ్స్‌ను ఏర్పాటు చేశారు.అయితే వాటివద్ద సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో పాదచారులు వినియోగించుకోవడం లేదు. కాబట్టి అందరికీ కనిపించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు దాటాళనుకునే వారు క్షేమంగా అక్కడ వేచి ఉండేలా అవగాహన కల్పిస్తాం.
-నరసింహరాజు. బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్