Lionel Messi : 2026 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా (Argentina), స్విట్జర్లాండ్ (Switgerland) మధ్య జరిగిన మ్యాచ్ కేవలం ఆటకు మాత్రమే పరిమితం కాలేదు. మైదానంలో తీవ్ర ఉద్రిక్తతకు కూడా దారితీసింది. ముఖ్యంగా అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi), మ్యాచ్ రిఫరీ జోవావో పిన్హీరో (Jovavo Pinheero) మధ్య జరిగిన వాగ్వాదం ఫుట్‌బాల్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. అదనపు సమయంలో అర్జెంటీనా విజయం సాధించినప్పటికీ, మెస్సీ ప్రదర్శించిన ఆగ్రహం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
మ్యాచ్ మొదటి అర్ధభాగంలో స్విట్జర్లాండ్‌కు ఫ్రీ కిక్ లభించినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. అర్జెంటీనా నిర్మించిన డిఫెన్సివ్ వాల్లో భాగంగా ఉన్న మెస్సీని నిబంధనల ప్రకారం నిర్దేశిత దూరం వెనక్కి జరగాలని రిఫరీ పిన్హీరో సూచించారు. అయితే రిఫరీ మాట్లాడిన తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన మెస్సీ వెంటనే స్పందించాడు. “నాతో మర్యాదగా మాట్లాడు. నన్ను అగౌరవపరచకు. నేను నీతో సరిగ్గానే మాట్లాడాను” అంటూ రిఫరీకి గట్టిగా బదులిచ్చాడు.
ఈ టోర్నమెంట్లో తొలిసారి గోల్ చేయడంలో విఫలమైన మెస్సీ మ్యాచ్ ఆసాంతం తీవ్ర నిరాశతో కనిపించాడు. స్విస్ జట్టు పటిష్ఠమైన డిఫెన్స్‌తో మెస్సీని సమర్థంగా కట్టడి చేయడంతో అతనిలో అసహనం మరింత పెరిగింది. నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసేసరికి స్కోరు 1-1తో సమంగా నిలవడంతో ఒత్తిడి తారస్థాయికి చేరింది. ఇదే మ్యాచ్‌లో రిఫరీ పిన్హీరో తీసుకున్న మరో నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. వీఏఆర్ సమీక్ష తర్వాత డైవింగ్ చేసినందుకు స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంభోలోకు రెడ్ కార్డ్ చూపించి మైదానం నుంచి పంపించేశారు.
దాంతో స్విస్ జట్టు 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అర్జెంటీనా అదనపు సమయంలో వేగంగా రెండు గోల్స్ చేసి విజయాన్ని అందుకుంది. పోర్చుగల్‌కు చెందిన 38 ఏళ్ల జోవావో పిన్హీరో, యూరప్‌లోని అత్యంత ప్రతిభావంతులైన రిఫరీలలో ఒకరిగా పేరుగాంచాడు. 2015లో పోర్చుగీస్ టాప్ ఫ్లైట్‌లో అరంగేట్రం చేసి, కేవలం ఏడాదిలోనే 2016లో ఫిఫా అంతర్జాతీయ బ్యాడ్జ్ సాధించాడు.
యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్, 2025 యూఈఎఫ్ఏ సూపర్ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలలో రిఫరీగా వ్యవహరించిన అనుభవంతో 2026 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. అయినప్పటికీ మెస్సీతో వివాదం కారణంగా పిన్హీరో ఇప్పుడు వార్తల్లో నిలిచారు.