న్యూఢిల్లీ, నవంబర్ 25: మధుమేహ రోగులు కొందరు రోజుకు మూడుసార్లు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వీరి బాధకు శాస్త్రవేత్తలు గొప్ప ఉపశమనాన్ని కనుగొన్నామని చెప్తున్నారు. ఇన్సులిన్‌ను శరీరానికి రాసుకొనే స్కిన్ క్రీమ్ రూపంలో రూపొందించామని అంటున్నారు. ఈ నూతన ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు ‘నేచర్’ పత్రికలో ఇటీవల ప్రచురితమయ్యాయి. ఈ పాలిమర్ ఇన్సులిన్ చర్మం ద్వారా రక్త ప్రవాహంలోకి దూసుకెళ్లగలదని అంటున్నారు.
పరిశోధన సందర్భంగా ఎలుకలు, పందులపై ఈ స్కిన్క్రీమ్ను ప్రయోగించినప్పుడు.. వాటి శరీరంలో చక్కెర స్థాయి తగ్గిపోయిందని తెలిపారు. ఇంజెక్షన్లు చేసే పనిని ఈ స్కిన్‌క్రీమ్ విజయవంతంగా పూర్తి చేసిందని, పైగా వాటి చర్మానికి దురద వంటి సమస్యలు రాలేదని పేర్కొన్నారు. ఎంతో సురక్షితమైన ఈ స్కిన్క్రీమ్తో శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చని వివరించారు. క్లినికల్ ట్రయల్స్ గనుక త్వరగా ప్రారంభమై.. ప్రయోగాలు స్థిరంగా ముందుకు సాగితే.. ఐదు నుంచి పదేండ్ల వ్యవధిలో ఈ స్కిన్ క్రీమ్ ఔషధ దుకాణాల్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు.