ఒంటరి ప్రయాణం అద్భుతమైన అనుభూతులను పంచుతుంది. కానీ, మహిళలు సోలోగా ప్రయాణించాలంటే అందుకు తగ్గ పరిస్థితులు ఎక్కడున్నాయి? ఈ పది దేశాలు మాత్రం సోలో ట్రావెలర్స్‌కు భరోసా ఇస్తున్నాయి. తమ దేశాల్లో యథేచ్ఛగా విహరించమని చెబుతున్నాయి. ఉమెన్స్ పీస్ అండ్ సెక్యూరిటీ (డబ్ల్యూపీఎస్) ఇండెక్స్ సర్వేలో సోలో ఉమెన్ ట్రావెలర్స్‌కు దన్నుగా నిలిచిన ఆ పది దేశాల సంగతులే ఇవి..
డెన్మార్క్: డబ్ల్యూపీఎస్ సర్వేలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే సంతోషకరమైన దేశంగానూ డెన్మార్క్ పేరుపొందింది. ఆధునిక జీవనంతో పాటు ప్రకృతితో మమేకమయ్యేవారు ఇక్కడ అధికం. ఆడ, మగ అనే భేదాలు ఇక్కడ కనిపించవు. మెరుగైన రవాణా సౌకర్యంతోపాటు కాలుష్యరహితంగా డెన్మార్క్ విలసిల్లుతుంది.
స్విట్జర్లాండ్: అద్భుతమైన ఆల్ఫ్స్ పర్వతాలు, కాలుష్యరహితమైన నగరాలు, ఆకర్షణీయమైన గ్రామాలకు నెలవు ఈ దేశం. మహిళలు ఒంటరిగా చేసే అద్భుతమైన ప్రయాణాలకు ఇది అనువైనది. ఇక్కడి ప్రజారవాణా వ్యవస్థ కూడా అత్యంత భద్రమైనదే.
స్వీడన్: పురోగమించే సంస్కృతి, బలమైన సామాజిక వ్యవస్థ స్వీడన్ సొంతం. సోలో ట్రావెలర్స్‌కు అనుకూలమైన దేశం. ఏ వేళలోనైనా ఒంటరిగా బైక్‌పై తిరుగొచ్చు. ప్రకృతి నెలవులు, అందమైన కెఫేలు పర్యాటకులకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి.
ఫిన్లాండ్: ప్రపంచంలో ఆనందంగా జీవించే దేశాల్లో ఫిన్లాండ్ మొదటి వరుసలో నిలిచింది. ఆహ్లాదరకరమైన సరస్సులు, అద్భుతమైన ఉత్తర ధ్రువ కాంతులు పర్యాటకులకు వింత అనుభూతిని పంచుతాయి. ఈ దేశంలో మారుమూల ప్రాంతాలు సైతం ఒంటరిగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి.
లక్సెంబర్గ్: చిన్నదేశమైన లక్సెంబర్గ్ నేరరహిత దేశాల జాబితాలో ఆగ్రస్థానంలో నిలిచింది. మెరుగైన సర్వీస్ సెక్టార్‌తో పాటు ఘనమైన నాగరికత ఉన్న దేశంగా పేరొందింది. ఎలాంటి చింత లేకుండా దేశంలోని గల్లీలన్నీ చుట్టేయొచ్చు. ప్రయాణ మార్గంలో స్థానికులు చక్కగా సహకరిస్తారు.
ఐస్లాండ్: నేరరహిత దేశాల జాబితాలో ఐస్లాండ్ కూడా అగ్రస్థానంలోనే నిలిచింది. ఈ దేశ ప్రజలు సహకారానికి మారుపేరు. ఆకర్షణీయమైన జలపాతాల నుంచి ఉష్ణజల సరస్సుల వరకు ఏ మూలకు ప్రయాణించినా ఓ వింత పలుకరిస్తుంది.
నార్వే: భద్రతకు తొలి ప్రాధాన్యం ఇచ్చే దేశం ఇది. నిస్సంకోచంగా ఇక్కడ పర్యటించవచ్చు. స్థానిక చట్టాలపై అవగాహన కలిగి ఉండటం మంచిది. అతిథులను ఆదరించడంలో నార్వే ముందుంటుంది. ఏ జంకూ లేకుండా పర్వతాలు చుట్టి రావొచ్చు.
ఆస్ట్రియా: పాత, కొత్తల మేలు కలయికగా అలరిస్తుంది ఆస్ట్రియా. భద్రత విషయంలో రాజీ పడరు. ముఖ్యంగా అతిథులకు ఏ ఇబ్బందీ లేకుండా ఇక్కడి వ్యవస్థలు పనిచేస్తుంటాయి. కాబట్టి ఆస్ట్రియాలో హ్యాపీగా విహరించొచ్చు.
నెదర్లాండ్స్: మర్యాదకు పెట్టింది పేరు నెదర్లాండ్స్. క్యాబ్ డ్రైవర్లు కూడా మర్యాదగా నడుచుకుంటారు. ఇక్కడి నగరాల్లో అందాలు వీక్షించడానికి సైక్లింగ్ మంచి సాధనం. ప్రకృతి వింతలు సరేసరి!
న్యూజిలాండ్: అడ్వెంచర్ డెస్టినేషన్స్‌కి ప్రసిద్ధిగాంచిన ఈ దేశంలో స్వేచ్ఛగా విహరించొచ్చు. కొత్తవారిని స్థానికులు సాదరంగా ఆహ్వానిస్తారు. మారుమూల పల్లెల్లోనూ ఘనమైన ఆతిథ్యం లభిస్తుంది.