IT Employee Suicide | సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడటం వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కాశీబుగ్గకు చెందిన యువతి మానసిక ఒత్తిడితో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కాశీబుగ్గలో పాత పేపర్లు కొనే వ్యాపారం చేసే గంజి ఉమాశంకర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో రెండు కుమార్తె గంజి కీర్తన (25) ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ఇటీవల పనిభారంతో కీర్తన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. మానసికంగా డిప్రెషన్లోకి వెళ్లిన కూతుర్ని చూసిన తల్లిదండ్రులు మూడు నెలల క్రితం వరంగల్‌కు తీసుకొచ్చారు.
హనుమకొండలోని ఓ మానసిక వైద్యుడి వద్ద కొంతకాలంగా చికిత్స కూడా ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కీర్తన ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.