ఎదులాపురం, నవంబర్ 21: ‘ఆమె ఆర్తి తీర్చెదెవరు’ శీర్షికతో నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన మానవీయ కథనం ఎందరినో కదిలించింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 మంది దాతలు ఆర్తికి సాయం చేసేందుకు ఆరాతీశారు. కడు పేదరికంలో ఉన్న ఆర్తికి కనీసం బ్యాంకు ఖాతాలేక పోవడంతో ఇబ్బందులు ఎదురవ్వగా.. బాధితురాలికి బ్యాంకు ఖాతా తెరిపించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జోగినపల్లి శ్రీనివాస్‌రావు నేరుగా రిక్షాకాలనీ అంగన్వాడీ కార్యకర్తతో మాట్లాడి బాధితురాలి వివరాలు తెలుసుకొన్నారు.
వెంటనే ఆదుకోవాలని ఆదిలాబాద్ డీసీపీవోకు సూచించారు. సోమవారం ఉదయం ఇంటికే అంబులెన్స్ పంపి వైద్యం చేయిస్తామని రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్, సూపరింటెండెంట్ శిరీష్ తెలిపారు. సఖీ సెంటర్ నుంచి దుస్తుల కిట్ అందజేశారు. ఆదిలాబాద్ డీసీపీవో రాజేంద్రప్రసాద్ ఆర్తి వద్దకు వెళ్లి 50 కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఇద్దరు పిల్లలకు నెలకు రూ.2 వేల చొప్పున, నిత్యావసరాలు మూడేండ్ల వరకు అందజేస్తామని హామీ ఇచ్చారు. కూతురి విషయం తెలుసుకొని తల్లి కూడా వచ్చి ఆర్తిని పలుకరించింది.