పిల్లల గది అంటే కేవలం నిద్ర పోయే స్థలమే కాదు… ఆడుకోవడానికి, ఊహాశక్తిని, చదువు పట్ల ఆసక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడే ఒక చిన్న ప్రపంచం. అందుకే ఇప్పుడు మార్కెట్లో పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెడ్షీట్లు కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి. ఇవి కేవలం రంగులు, కార్టూన్లతో మాత్రమే కాకుండా, చదువు, ఆట, టెక్నాలజీల మేళవింపుగా సమగ్రమైన అనుభవాన్ని ఇస్తున్నాయి.
పిల్లల మెదడు ఎంతో చురుగ్గా ఉంటుంది. వాళ్లకు తన చుట్టూ ఉండే ఎన్నో విషయాలు కొత్తగా వింతగా తోస్తుంటాయి. వినూత్నమైన అనుభూతుల్ని ఆస్వాదించడంలో పిల్లల తర్వాతే ఎవరైనా. అందుకే వాళ్ల కోసం గ్లో ఇన్ ద డార్క్ బెడ్షీట్లు రూపొందుతున్నాయి. పగటిపూట చూస్తే సాధారణ బెడ్షీట్లలా ఉండే ఇవి, లైట్లు ఆర్పగానే మెరిసిపోతూ కనిపిస్తాయి. ఇందుకోసం చీకట్లో మెరిసే ప్రత్యేకమైన పదార్థంతో వీటి మీద ప్రింట్లను వేస్తారు. అలాగని సౌకర్యం విషయంలోనూ రాజీ పడాల్సిన అవసరం లేదు. ఈ తరహా బెడ్షీట్లలో నక్షత్రాలు, చంద్రుడు, స్పేస్ డిజైన్లు ఎక్కువగా వస్తాయి. దీంతో వెలిగే నక్షత్రాల మధ్య పడుకున్న అనుభూతిని పిల్లలు పొందుతారు. అంతేకాదు చీకటి అంటే భయాన్ని తగ్గించడంలో ఇవి సాయపడతాయి. పిల్లల్లో ఊహాశక్తిని పెంచుతాయి. చిన్నారులకి ఇది నిజంగా స్టార్ బెడ్ అనిపిస్తుంది.
డిజిటల్ స్క్రీన్ల మధ్య రోజులు గడుస్తున్న ఈ కాలంలో, కుటుంబం అంతా కలిసి నవ్వుకునే క్షణాలు తగ్గిపోతున్నాయి. అలాంటి సమయంలో ఇంటి పడక గదినే ఆట స్థలంగా మార్చే ఒక వినూత్న ఆలోచన బోర్డ్ గేమ్ ప్రింటెడ్ బెడ్షీట్లు. లూడో, స్నేక్ అండ్ లాడర్, చెస్ లాంటి రకరకాల ఆటలు ముద్రించి ఈ బెడ్షీట్లు వస్తున్నాయి. వాటితో పాటు ఆడుకోడానికి అవసరమైన పావులు డైస్‌ని కూడా ఇస్తున్నారు. ఈ బెడ్షీట్లు పరచుకున్న వెంటనే పిల్లల మంచం పూర్తి గేమ్ బోర్డుగా మారిపోతుంది.

ఎండాకాలంలో బయటికి వెళ్లి ఆడుకునే అవకాశం లేనప్పుడు ఇవి చక్కగా ఉపయోగపడతాయి. అంతే కాదు స్క్రీన్లకు దూరంగా పెద్దలు పిల్లలతో కలిసి గడిపేందుకు ఇవి ఒక మంచి అవకాశాన్ని ఇస్తాయి. కుటుంబంలో అనుబంధాలు పెనవేసుకోవడానికి కూడా ఈ బెడ్షీట్లు ఒక మంచి మార్గం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్లతోపాటు హోమ్ డెకార్ షాపుల్లోనూ ఇవి దొరుకుతున్నాయి. ఇంటి కోసం కొనుక్కున్నా లేదా బర్త్ డే, గృహప్రవేశం, పిల్లల పార్టీలప్పుడు బహుమతిగా ఇచ్చేందుకు కూడా మంచి ఎంపిక.
పిల్లలు ఆడుకుంటూ నేర్చుకునేలా రూపొందించిన ఎడ్యుకేషనల్ బెడ్షీట్లు కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటి మీద వస్తున్న అక్షరాలు, సంఖ్యలు, మ్యాప్‌లు, సౌరవ్యవస్థ ప్రింట్లు, చదువుపై ఆసక్తి పెంచడానికి సాయపడతాయి. తద్వారా ప్రీ-స్కూల్ పిల్లలకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. విజువల్ మెమరీ బలపడుతుంది.

తమ గదిలో ఇలా రోజూ చూడటం ద్వారా ముఖ్యమైన, ప్రాథమికమైన విషయాలను సులభంగా గుర్తుపెట్టుకోగలుగుతారు. పిల్లల కోసం గదుల్లో ప్రత్యేకంగా చార్టులు అతికించే అవసరం కూడా ఉండదు. చూసేందుకు కూడా సాధారణ బెడ్షీట్లలా కాకుండా విభిన్నంగా కనిపించే ఇవి పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
చాలామంది 3D ప్రింటింగ్ గురించి వినే ఉంటారు. కానీ, 8D అనేది దాని అడ్వాన్స్డ్ వెర్షన్. ఇది కేవలం ప్రింటింగ్ మాత్రమే కాదు, హై-డెఫినిషన్ విజువల్స్, మైక్రో-లెవల్ డిటైలింగ్‌తో కూడిన టెక్నాలజీ. వీటిపై ఉండే పూలు, ప్రకృతి దృశ్యాలు లేదా జంతువుల బొమ్మలు కేవలం డిజైన్లలా కాకుండా, నిజంగా మన కళ్ల ముందే ఉన్నాయా అనే భ్రమను కలిగిస్తాయి. మనం ఒక పూల డిజైన్ ఉన్న 8D బెడ్‌షీట్ వేస్తే, ఆ పూలు పరుపుపై వికసించినట్లుగా కనిపిస్తాయి. అదే బొమ్మలు ఉన్న బెడ్‌షీట్ వేస్తే అక్కడ నిజంగా బొమ్మ ఉన్నట్టు అనిపిస్తుంది. దీనినే ‘డిజిటల్ ఇల్యూషన్’ అని పిలుస్తారు. పిల్లలు చేతితో తాకితే కూడా ఇది నిజమా? అనే అనుమానం కలుగుతుంది.

కార్టూన్ క్యారెక్టర్లు, జంతువులు, బొమ్మలు, సముద్ర ప్రపంచం, అంతరిక్షం.. ఇలా రకరకాల థీమ్స్ ఉన్న 8D షీట్లు పిల్లల గదిని అద్భుతంగా మారుస్తాయి. జలపాతాలు, అడవులు, పచ్చని మైదానాల డిజైన్లు గదిలో ప్రశాంతతను నింపి, పిల్లల్లో ఉహా శక్తిని పెంపొందిస్తాయి. ఇవి సాధారణంగా గ్లాసీ కాటన్ లేదా మైక్రోఫైబర్ మెటీరియల్‌తో తయారవుతాయి. ఇవి చర్మానికి ఎంతో మెత్తగా ఉండటమే కాకుండా, చెమటను త్వరగా పీల్చుకుంటాయి. మాములుగా బెడ్షీట్లు కొన్నిసార్లు ఉతికిన తర్వాత రంగు వెలిసిపోతాయి. కానీ, 8D బెడ్షీట్లు ‘కలర్ ఫాస్ట్’ టెక్నాలజీతో వస్తాయి, కాబట్టి ఎన్నిసార్లు వాష్ చేసినా కొత్తవాటిలాగే మెరుస్తాయి. మొత్తానికి 8D బెడ్షీట్లు పిల్లల గదిని ఒక మ్యాజిక్ వరల్డ్‌లా మార్చే సామర్థ్యం కలిగినవని చెప్పొచ్చు.
పిల్లలకు ఇష్టమైన పాత్రలతో బెడ్షీట్లు ఎప్పటికీ అవుట్‌డేట్ కావు. సూపర్ హీరోలు, కార్టూన్ క్యారెక్టర్స్, ఫెయిరీటేల్ థీమ్స్… ఇవి పిల్లల గదిని ఒక కథలా మార్చేస్తాయి. పిల్లల్లో సానుకూల భావనలు పెంపొందిస్తాయి. చాలామంది చిన్నారులకు ఒక్కరే గదిలో పడుకోవాలంటే భయం ఉంటుంది. అలా ఒంటరిగా పడుకోవడంపై భయం తగ్గిస్థాయివి.

తమ సూపర్ హీరో లేదా ప్రియమైన క్యారెక్టర్ తమ పక్కనే ఉన్నారన్న అనుభూతిని కలిగిస్తాయి. నిండైన రంగులు అందమైన బొమ్మలతో వచ్చే ఇవి గది డెకర్‌ను కలర్ఫుల్గా మారుస్తాయి. వీటిని ఎంచుకోవడం అంటే పిల్లల ఫేవరెట్ వరల్డ్‌ను వారి బెడ్‌పైనే తీసుకురావడమే!