ఆడవారి అలకను తగ్గించడంలో అవతలి వ్యక్తి చూపించే చిన్న శ్రద్ధే ఆ బంధానికి పెద్ద బలం. ఆమె అలిగితే ఏం చేయాలి? పదేపదే ‘ఏమైంది?’ అని అడగాలా? ‘నీ ఇష్టం’ అంటూ తన పనిలో తాను మునిగిపోవాలా? లేదా ఏదో ఒకటి మాట్లాడి ఆమెను నవ్వించాలా? నిజానికి అలక వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడమే మొదటి అడుగు. కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం, మరికొన్ని సార్లు చెప్పిన మాటకు విలువ ఇవ్వకపోవడం.. ఇలా ఎన్నో విషయాలు మనసును నొప్పిస్తాయి.
ఆమె తన బాధను చెప్పుకొంటున్నప్పుడు వెంటనే సమర్థించుకోవడం, ఎదుటివారిపై తప్పు నెట్టడం పరిస్థితిని మరింత జటిలం చేయవచ్చు. ఆమె చెప్పేది పూర్తిగా విని, ‘నీకు అలా అనిపించడం సహజమే’ అని భావాలను గౌరవించడం అవసరం. తప్పు తనదైతే నిజాయితీగా క్షమాపణ చెప్పాలి. ఆ మాటలో నిజాయితీ ఉంటేనే మనసుకు ఊరట కలుగుతుంది.
ఆమెకు ఇష్టమైన కాఫీ అందించడం, కాసేపు పకన కూర్చోవడం, మనసుకు నచ్చిన చోటుకు తీసుకెళ్లడం, చిన్న సందేశం పంపడం.. ఇలాంటి ప్రయత్నాలు అలకను తగ్గించవచ్చు. ఆ చిన్న ప్రయత్నం ఆమెకు పెద్ద సంతోషం కలిగించొచ్చు. అయితే ఆమెకు కొంత సమయం ఒంటరిగా ఉండాలనిపిస్తే మాత్రం ఆ అవకాశాన్ని గౌరవించాలి. బలవంతంగా మాట్లాడించడానికి ప్రయత్నించకూడదు.
అలక తగ్గిన తర్వాత అసలు సమస్య గురించి ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఏ విషయం బాధించిందో తెలుసుకుని, మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ప్రతిసారీ బహుమతులు ఇవ్వడం కంటే, ఆమె మాటలకు విలువ ఇవ్వడం, బాధ్యతలను పంచుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యం. భార్య లేదా ప్రేయసి అలిగినప్పుడు ఆమెను బుజ్జగించడం అంటే కేవలం నవ్వించడం కాదు. ఆమె భావాలను అర్థం చేసుకుని, తనకు ఈ బంధంలో ప్రత్యేక స్థానం ఉందనే భరోసా కల్పించడం.