e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల

పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల

పాట కాలక్షేపం కోసం కాదు..అదొక జీవన వాహిని. వైయక్తిక తాహతులను బట్టి ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత రససిద్ధిని కలిగించడమే పాట పరమార్థం. మాటలు చాలక, భాష మూగబోయే స్థితిలో పాట పుడుతుంది. నిర్వికారమైన అనేకానేక నైరూప్య భావనలను అక్షరబద్దం చేస్తూ హృదయపు అంతరాంతరాల్ని తరచిచూసేదే పాట. అలాంటి సమస్త భావోద్వేగాలకు ఓ ఆలంబనగా భాసిల్లింది సిరివెన్నెల గీతం. లలిత గీతాలు, ప్రణయసంవేదనా గేయాలు అభ్యుదయ భావగీతికలు, తాత్విక చింతనాభరిత పాటలు..ఇలా ఒకటేమిటి సిరివెన్నెల మస్తిష్కం నుంచి రెక్కలిప్పుకున్న భావనా విహాంగాలు తెలుగు పాటల జగత్తులో సమస్త పార్శాల్ని తరచిచూశాయి.

ఆయన పాట నిజాల్ని నిగ్గదీసి అడిగే ఓ చైతన్య గీతమై ప్రజ్వరిల్లింది. వేలవేల ప్రణయభావాలకు అద్దం పట్టింది. జగమంత కుటుంబం నాది అంటూ అలతిఅలతి పదాల్లో జీవిత తాత్వికతను చాటిచెప్పింది. సురాజ్య మవలేని స్వరాజ్యమెందుకంటూ స్వర్ణోత్సపు సంరంభంలోని డొల్లతనాన్ని, సమాజంలో పేరుకుపోయిన సంకుచిత ధోరణుల్ని కళ్లముందుంచింది. ఎంత వరకు ఎందుకొరకు ఇంత పరుగు అంటూ గమనాన్నే గమ్యంగా భావించాలని ఉద్బోధించింది. దేశభక్తి, ప్రేమసూక్తి, మానవ సంబంధ మైత్రి, జీవన తాత్విక శక్తిగా సిరివెన్నెల కలం తెలుగు సినీ యవనికపై కోటి పున్నమిల భావధారల్ని వర్షించింది.

- Advertisement -

1955 మే 20న మధ్యప్రదేశ్‌లోని శివినిలో సీతారామశాస్త్రి జన్మించారు. అనకాపల్లిలో ఆయన బాల్యజీవితంతో పాటు విద్యాభ్యాసం కొనసాగింది. సిరివెన్నెల అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. ఆయన తండ్రి సీవీ యోగికి పదిహేను భాషలతో పాటు పురాణాలు, ఇతిహాసాల పట్ల చక్కటి పరిజ్ఞానం ఉండేది. ఆయన ద్వారా సీతారామశాస్త్రికి సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడింది. చదువులోనూ ముందుండేవారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరారు. కానీ కుటుంబ బాధ్యతల వల్ల వైద్య విద్యకు మొదటి ఏడాదితోనే స్వస్తిపలికి టెలిఫోన్‌శాఖలో అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు.

ఉద్యోగం చేస్తూనే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎమ్‌ఏ పూర్తిచేశారు. కాకినాడలో పనిచేస్తున్న సమయంలో సీ.వి.కృష్ణారావు, ఇస్మాయిల్‌, రాంషా వంటి సాహితీవేత్తలతో ఆయనకు స్నేహం మొదలైంది. వారి ప్రోద్భలంతో భరణి అనే కలం పేరుతో పలు పత్రికల్లో కథలు, కవితలు రాశారు. పాటలు రాయడంలో సీతారామశాస్త్రికి ఉన్న మక్కువను గమనించిన గురువు సత్యారావు, సినీ రచయిత ఆకెళ్ల ‘శంకరాభరణం’ విజయోత్సవ బృందాన్ని స్వాగతిస్తూ ‘గంగావతరణం’ పేరుతో ఓ గేయాన్ని ఆయనతో రాయించారు. చక్కటి సాహిత్యపు విలువలతో సిరివెన్నెల పాటను రాసిన విధానం పట్ల ముగ్ధుడైన దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్‌ తాను దర్శకత్వం వహించిన ‘జననీ జన్మభూమి’లో ఆ పరిచయగీతాన్ని ఉపయోగించారు.

ఆ తర్వాత తాను దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’ సినిమాతో సీతారామశాస్త్రిని గేయరచయితగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. ‘సిరివెన్నెల’ చిత్ర గీతాలు విశేష ఆదరణను సొంతం చేసుకున్నాయి. తొలి సినిమాతోనే సీతారామశాస్త్రి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఈ సినిమాలో రాసిన తొలి పాట ‘విధాత తలపున ప్రభవించినది’తోనే సీతారామశాస్త్రి నంది పురస్కారాన్ని అందుకోవడం విశేషం. విశ్వనాథ్‌ లేకపోతే తనకు సినీ జీవితమే లేదని సీతారామశాస్త్రి అనేక సందర్భాల్లో చెప్పారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన స్వాతికిరణం, స్వర్ణకమలం, శృతిలయలు చిత్రాల్లో సిరివెన్నెల అత్యద్భుతమైన గీతాల్ని రాశారు. ఈ పాటలు ఎవర్‌గ్రీన్‌గా నేటికీ సంగీతప్రియుల్ని అలరిస్తున్నాయి.

తాత్విక భావాల మేటి

సిరివెన్నెల ప్రతి పాటలో ఓ జీవన తాత్వికత ధ్వనిస్తుంది. కళకు సామాజిక పరమార్థం ఉండాలని, పాట జనబాహుళ్యంలో పరివర్తన తీసుకురావాలని నిరంతరం అభిలషించారాయన. ఒక్కో పాట జీవిత విలువకు సమానమని నమ్మారు. భావం వెనక పదాలు పరుగులు తీయొద్దని, భావమే తనకు కావాల్సిన పదాల్ని వెతుక్కుంటుందన్నది ఆయన నమ్మిన సిద్ధాంతం. సిరివెన్నెల బాల్యంలోనే ‘భగవద్గీత’ ‘శివానందలహరి’ వంటి భారతీయ పౌరాణిక గ్రంథాల్ని ఔపోసన పట్టాడు.

సినీ రంగంలోకి రాకముందే రాసుకున్న కవితల్లోనే నిగూఢమైన తాత్వికత కనిపించేది. ‘సిరివెన్నెల’ చిత్రంలో ఆయన రాసిన ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం.’ పాటలో తాత్విక లోతుల్ని స్పృశించారు. ‘జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం..చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం’ అనే చరణాల్లో శిశువు తొలి పిలుపును ఆనాదిరాగంగా, సృష్టి విలాస తత్వానికి చిరునామాగా అభివర్ణించారు.

కేవీ మహదేవన్‌ స్వరకల్పనలో వచ్చిన ఈ పాట తెలుగు సినీ పరిశ్రమలో ఓ సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని చందమామ రావే, ఆది భిక్షువు వాడినేది కోరేది, ఈ గాలీ ఈ నేలా.. ప్రతీ పాట అద్భుత భాషా సౌందర్యం, అసమానమైన పాండిత్యప్రకర్షతో తెలుగు పాటకు కొత్త సొబగులద్దింది. తాత్వికత, తార్కిక వివేచన, హృదయంలో రసస్పందన కలిగించే భావుకత్వం తన పాటకు మూలస్తంభాలుగా సిరివెన్నెల ప్రస్థానాన్ని సాగించారు. భారతీయత, సామాజిక స్పృహ, మానవీయ చేతన పరివేష్టించిన ఆయన గీతాలు రెండు తరాల పాటు పండితపామర జనరంజకంగా ఆదరణ పొందాయి.

అభ్యుదయ గీతాల స్ఫూర్తిప్రదాత

లోకరీతిని నిరసిస్తూ, సమాజంలోని అన్యాయాలపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ సిరివెన్నెల రాసిన పాటలు ప్రజల్లో కొత్త చైతన్యాన్ని నింపాయి. సమాజంలోని ప్రతి వ్యక్తికి ధర్మాగ్రాహం ఉండాలని ఎలుగెత్తి చాటారాయన. ‘సింధూరం’ చిత్రంలో సిరివెన్నెల రాసిన ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్ర మందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా? పాట నాటి యువతరంలో ఆవేశాన్ని రగిలించింది. ‘సురాజ్య మవలేని స్వరాజ్యమెందుకని..సుఖాల మనలేని వికాసమెందుకని’ అనే పంక్తులు స్వరాజ్య ఫలం ఎందుకోసమని ప్రశ్నించాయి. ‘గాయం’ చిత్రంలోని ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ పాట అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక ప్రయోజనాత్మక గీతంగా నిలిచిపోయింది. ‘ఖడ్గం’లోని ‘మేమే ఇండియన్స్‌’, ‘మహాత్మ’లోని ‘కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ’ పాటలు దేశభక్తి భావాల్ని ప్రోదికొల్పాయి.

బహుముఖ భావాల పెన్నిధి

ప్రేమ గీతాల్లో కొత్త ఒరవడిని సృష్టించారు సిరివెన్నెల. సరళమైన తెలుగులో ఆయన రాసిన వలపు గీతాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఎందరో ప్రేమికుల హృదయాలకు స్వాంతన నిచ్చాయి. కొంగొత్త భావాలకు మొగ్గతొడిగాయి. ‘కన్నుల్లో నీ రూపమే’ అంటూ ప్రియురాలిని గుండెల నిండా నింపుకున్న ప్రియసఖుడి అంతరంగాన్ని ఆవిష్కరించాయి. ‘అలుపన్నది ఉందా ఎగిసే అలకు ఎదలోని లయకు’ అంటూ ప్రేమికుల అంతరంగాల్లోని అలజడులను అందంగా అభివ్యక్తీకరించాయి. ‘తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో..’ అంటూ అజరామరమైన ప్రేమకు భాష్యమేమిటో చెప్పాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కలం నుంచి జాలువారిన ఎన్నో ప్రణయ గీతాలు ప్రేమికుల సంవేదనలను, సంతోషాలు, సల్లాపాలను అందంగా ఆవిష్కరించాయి. విషాద ప్రణయగీతాలకు కూడా సిరివెన్నెల పెట్టింది పేరు.

ఇక ఆయన రాసిన వాన పాటలు హృదయసీమల్లో ఎన్నో తడి జ్ఞాపకాల్ని మిగిల్చాయి. ‘వర్షం’లోని ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా..ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా.. చుట్టంలా వస్తావే చూసెళ్లిపోతావే’..పాట చాలా ప్రత్యేకంగా నిలిచిపోయింది. వర్షాన్ని తన నేస్తంలా భావిస్తూ ఓ పడచుపిల్ల పాడుకునే అపురూప గీతంలా మెప్పించింది. ‘ఇంద్ర’ చిత్రంలోని ‘ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా..’ పాట సాధారణ వాన పాటలకు భిన్నంగా నిలిచింది. కరువు సీమల్లో వర్షాన్ని ఆహ్వానిస్తూ ..జడివానలో జనజీవితాలు చిగురించాలని..నేలంతా సుగంధాలుగా మారాలంటూ ఆనందోత్సాహాలను నింపింది.

వీటితో పాటు ‘చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే’ ‘మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం’ ‘ఆకాశగంగా దూకావే పెంకితనంగా..’ మొదలైన పాటలు ప్రసిద్ధ వాన పాటలుగా నిలిచాయి. తెలుగు భాషకు సంబంధించి సిరివెన్నెల ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎలాంటి భాషా పరిజ్ఞానం లేని వారికి కూడా అర్థమయ్యేలా వచన గీతాలను రచించారు. సాధారణ మాటల్లా ఉండే పదాలతో పాటలు రాసి మెప్పించారు. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో..’ ‘బోటనీ పాఠముంది మేటనీ ఆటఉంది’ ‘అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా..’ వంటి పాటలు సిరివెన్నెల వచనా శైలికి నిదర్శనంగా నిలిచాయి.

‘పట్టుదల’ పెంచిన గీతాలు

‘పట్టుదల’ చిత్రంలో సీతారామశాస్త్రి రాసిన ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ పాట లక్షల మంది యువతకు ప్రభోదాత్మక గీతంగా నిలిచింది. ‘నెత్తురుంది సత్తువుంది..ఇంతకంటే సైన్యముండునా’ అనే మాటలు లక్షల మెదళ్లను కదిలించాయి. ఇక ‘జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది..సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే’ పాటలో జీవనసారాన్ని పలికించారు సిరివెన్నెల. బతుకు అర్థాన్ని, జీవన పరమార్థాన్ని రంగరించిన ఈ గీతం విశేష ప్రజాదరణ సొంతం చేసుకుంది. భూమ్మీదకు అతిథిలా వచ్చి వెళ్లే మనుషులకు ఏది ఆవశ్యమో ఏది కాదో అనే తాత్వికతను ఆ పాట తెలియజెప్పింది.

ఆశావాహ గీతాలు

సిరివెన్నెల గీతాల్లో ఆశావాహదృక్పథం, రేపటిపై విశ్వాసంతో జీవించాలనే మేల్కొలుపు కనిపిస్తుంది. ‘రుద్రవీణ’ చిత్రంలోని ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని’..‘తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం’, ‘కళ్లు’ చిత్రంలోని ‘తెల్లారింది లెగండో..’పాటలు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోన్నైనా బతుకుపై ప్రేమను వదులుకోవద్దని, జీవితం ఎప్పుడో ఒకప్పుడు అదృష్టాన్ని కటాక్షిస్తుందనే సత్యాన్ని తెలియజెప్పాయి.

తండ్రి బాటలోనే

సిరివెన్నెల సీతారామశాస్త్రికి భార్య పద్మావతితో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె లలితాదేవి ఉన్నారు. కుమారులిద్దరూ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. రాజా నటుడిగా రాణిస్తున్నారు. యోగేశ్వర శర్మ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. దర్శకుడు కృష్ణవంశీని సీతారామశాస్త్రి దత్తత తీసుకున్నారు.

కమర్షియల్‌ సినిమాలకు పనికిరాడన్నారు..

సిరివెన్నెల, శ్రుతిలయలు వంటి సినిమాల వల్ల భావుకత, కవితాత్మకతతో కూడిన పాటలు తప్ప కమర్షియల్‌ సినిమాలకు పాటలు రాయలేడనే ముద్ర సిరివెన్నెలపై పడింది. ఆ ఇమేజ్‌ నుంచి దూరం అవ్వడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టలేదు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘లేడీస్‌ టైలర్‌’ సినిమాతో ప్రేమ, శృంగార రసంతో కూడిన గీతాల్ని రాయగలనని నిరూపించుకున్నారు.

సాహిత్యకారుడిగా..

గేయరచయితగానే కాకుండా చక్కటి కథలు, కవిత్వంతో సాహితీలోకంలో తనదైన ముద్రవేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. తన ఇష్ట ఇష్టదైవం శివుడిపై భక్తితో ‘శివదర్పణం’ అనే పుస్తకాన్ని రాశారు. తాను రాసిన పాటలు, వాటి వెనక ఉన్న సంఘటనల్ని పొందుపరుస్త్తూ ‘సిరివెన్నెల తరంగాలు’, ‘నంది వర్ధనాలు’ పేరుతో చేసిన రచనలకు అనేక అవార్డులు వరించాయి. పెళ్లి గొప్పతనాన్ని పాటల రూపంలో ఆవిష్కరిస్తూ ఆయన రాసిన ‘కల్యాణరాగాలు’ చక్కటి ప్రజాదరణ పొందింది. తాను రాసిన కథలను ‘ఎన్నో రంగుల తెల్లకిరణం’ పేరుతో సంపుటంగా విడుదలచేశారాయన. క్షీరసాగరమథనం గేయకావ్యంతో నాన్న పులి, సన్మానోపనిషత్తు, తాత్విక వ్యాసాలు అనే పుస్తకాల్ని రాశారు.

పద్మశ్రీతో సత్కారం

సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో జనరంజకమైన గీతాల్ని రాసిన సీతారామశాస్త్రిని వరించని పురస్కారం లేదంటే అతిశయోక్తికాదు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2019లో అత్యున్నత పురస్కారం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. తెలుగు సినీ గేయరచయితల్లో అత్యధిక నంది అవార్డులను అందుకున్నది సీతారామశాస్త్రి కావడం విశేషం. సిరివెన్నెల(విధాత తలపున), శృతిలయలు(తెలవారదేమో), స్వర్ణకమలం (అందెల రవమిది), గాయం (సురాజ్య మవలేని),శుభలగ్నం(చిలకా ఏ తోడు), శ్రీకారం (మనసు కాస్త కలత), సింధూరం (అర్ధ శతాబ్దపు), ప్రేమకథ (దేవుడు కరుణిస్తాడని), చక్రం (జగమంతకుటుంబం నాది), గమ్యం (ఎంతవరకు ఎందుకొరకు), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (మరీ అంతగా) చిత్రాల్లో రాసిన గీతాలకు నంది పురస్కారాల్ని అందుకున్నారు. నాలుగు ఫిలింఫేర్‌, కళాసాగర్‌, మనస్విని-ఆత్రేయ అవార్డులను దక్కించుకొని ప్రతిభను చాటుకున్నారు.

కష్టాల్లో ఉన్న ఎన్నో సందర్భాల్లో సీతారామశాస్త్రిగారు రాసిన ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులు కోవద్దురా ఓరిమి’ పాట ధైర్యాన్ని నింపింది. భయం వేసినప్పుడల్లా ఆ పాట గుర్తు తెచ్చుకొని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని దోస్తీ మ్యూజిక్‌ వీడియో లిరిక్‌ పేపర్‌లో ఆయన సంతకం చేసే షాట్‌ తీద్దామని చాలా ప్రయత్నించాం. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. నా జీవన గమనానికి దిశానిర్దేశం చేశారు సీతారామశాస్త్రి – ఎస్‌.ఎస్‌. రాజమౌళి.

తెలుగు సినీ సాహిత్యానికి వేటూరి, సిరివెన్నెల ఇద్దరూ రెండుకళ్ల వంటివారు. శృంగారం, వైరాగ్యం, హాస్యం, ఆవేశం, ఉద్రేకం..ఇలా అన్ని రసాల్ని పండించాడు. నాకు ఆత్మీయుడు. ఆత్మబంధువు. -తనికెళ్లభరణి.

సిరివెన్నెల మరణం తెలుగు చిత్రసీమను శోకసంద్రంలో ముంచింది. ఓ సాహితీశిఖరం నెలకొరిగిందని, తెలుగు పాట ఒంటరైపోయిందని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెలతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.ఈ విషయం నమ్మలేకపోతున్నాను. సిరివెన్నెల మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కుడిభుజాన్ని కోల్పోయాననిపించింది. ఇప్పుడు నా ఎడమ భుజాన్ని కోల్పోయా. ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎంతో సన్నిహితంగా వుండే ఆయన అనుకోకుండా మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే నమ్మకం కలగడం లేదు. -సీనియర్‌ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌

సిరివెన్నెల మనకిక లేదు. సాహిత్యానికి చీకటి రోజు నేడు. సిరివెన్నెల గారు ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. భౌతికంగా ఆయన దూరమయ్యారు కానీ తన పాటలతో ఇంకా బతికే ఉన్నారు. పాట బతికున్నంత కాలం సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా బతికే వుంటారు – చిరంజీవి

సిరివెన్నెల సీతారామశాస్త్రి నాకు అత్యంత సన్నిహితుడు.. సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరింది.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. -మోహన్‌బాబు

తెలుగు పాటని తన సాహిత్యంతో దశదిశల వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నాకు ఎంతో ఆప్తులు.. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాయడం జరిగింది. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల గారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. -నందమూరి బాలకృష్ణ

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంతకాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచి వుంటాయి. -జూనియర్‌ ఎన్టీఆర్‌

తెలుగు పాటను కొత్తపుంతలు తొక్కించిన ఆ మహనీయుడు ఇక లేరు అనే వాస్తవం జీర్ణించుకోలేనిది. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు ఎంతో తీరనిలోటు. – పవన్‌కల్యాణ్‌

సిరివెన్నెల మా అందరికి ఆదర్శప్రాయుడు.నాకు ఆయనతో మంచి పరిచయం ఉంది. తెలుగు సినిమా పాటకు, పాటల ప్రపంచానికి చాలా పెద్ద నష్టం. ఈ నష్టం ఎవరూ పూడ్చలేనిది. మా పెద్ద దిక్కు కోల్పోయినట్టు అనిపిస్తుంది. -సుద్దాల అశోక్‌ తేజ, గేయ రచయిత

జగమంత కుటుంబం మీది. మీరు లేక ఏకాకి జీవితం మాది. మా జీవితాలను పాటలమయం చేసినందుకు ధన్యవాదాలు గురూజీ.. సిరివెన్నెల గారు లేని లోటు తీర్చలేనిది. – ప్రకాష్‌రాజ్‌

గుండె నిండు గర్భిణిలా ఉంది. ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తుంది. తల్లి కాగితానికి దూరమై అక్షరాల పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నాయ్‌. మీరు బ్రతికే ఉన్నారు. పాట తన ప్రాణం పోగొట్టుకుంది. మీరు ఎప్పటికి రాయని పాటలాగ మేం మిగిలిపోయాం – దర్శకుడు సుకుమార్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement