లండన్ : వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు టాప్ సీడెడ్స్ మధ్య ఫైనల్‌కు తెరలేచింది. డిఫెండింగ్ చాంప్, వరల్డ్ నంబర్ యానిక్ సినర్.. రెండో సీడ్ జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫైనల్ చేరారు. గత నెల ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి గ్రాండ్‌స్లామ్ కలను నెరవేర్చుకున్న జ్వెరెవ్ తన రెండో మేజర్ ట్రోఫీకి అడుగు దూరంలో నిలవగా.. ఇంకోవైపు గ్రాస్ కోర్ట్ కింగ్ నొవాక్ జొకోవిచ్‌ను వరుస సెట్లలో ఓడించిన ఇటలీ స్టార్ సినర్ టైటిల్ నిలబెట్టుకునేందుకు రెడీ అయ్యాడు. గత నెల మట్టికోర్టులో చూపిన జోరు పచ్చికపైనా కొనసాగిస్తున్న జ్వెరెవ్ శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో 7-6 (7/0), 6-2, 6-4తో బ్రిటన్ వైల్డ్ కార్డ్ ఆటగాడు ఆర్థర్ ఫెరీని ఓడించాడు. 1995లో బోరిస్ బెకర్ తర్వాత వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ చేరిన జర్మనీ తొలి ఆటగాడిగా జ్వెరెవ్ రికార్డు సృష్టించాడు.
గతంలో వింబుల్డన్‌లో ఎన్నడూ నాలుగో రౌండ్ దాటని అతను ఈసారి ఏకంగా ఫైనల్ చేరడం విశేషం. మరో మ్యాచ్‌లో బలమైన సర్వీస్‌లు, ఏకంగా 16 ఏస్‌లతో హడలెత్తించిన టాప్ సీడ్ సినర్ 6-4, 6-4, 6-4 తో ఏడో సీడ్ జొకోవిచ్ (సెర్బియా)ను వరుస సెట్లలో ఓడించాడు. ఏడోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన సినర్ మూడు బ్రేక్ పాయింట్లు రాబట్టగా.. నొవాక్ ఒక్క బ్రేక్ కూడా సాధించలేకపోయాడు. సినర్‌కు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన 39 ఏండ్ల జొకో 25వ గ్రాండ్‌స్లామ్ నెగ్గాలన్న ప్రయత్నానికి మరోసారి బ్రేక్ పడింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంప్ సినర్, జ్వెరెవ్ తలపడతారు.