US Open | న్యూయార్క్: టాప్ సీడ్లంతా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో ఇటలీ కుర్రాడు జన్నిక్ సిన్నర్ మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో ఒకటో సీడ్ సిన్నర్ 6-1, 6-4, 6-2తో క్రిస్ ఒ కనెల్ (ఆస్ట్రేలియా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గంటా 53 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సిన్నర్ 15 ఏస్‌లు సంధించగా 46 విన్నర్లు కొట్టాడు. గత రెండు రౌండ్లలో ఆరంభంలో కాస్త ఇబ్బందిపడ్డ సిన్నర్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. మరో మ్యాచ్‌లో డేనియల్ మెద్వెదెవ్ (రష్యా) 6-3, 6-4, 6-3తో ఫ్లేవియొ కొబొలి (ఇటలీ)ని వరుస సెట్లలో చిత్తుచేసి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. యూఎస్ ఓపెన్ టాప్-10 సీడెడ్ ఆటగాళ్లలో సిన్నర్, మెద్వెదెవ్, జ్వెరెవ్ మాత్రమే ప్రిక్వార్టర్స్‌కు చేరడం గమనార్హం.
స్వియాటెక్, సబలెంక దూకుడు
మహిళల సింగిల్స్‌లో పోలండ్ సంచలనం ఇగా స్వియాటెక్‌తో పాటు బెలారస్ భామ అరీనా సబలెంక, ఇటలీ చిన్నది జాస్మిన్ పలోని ప్రిక్వార్టర్స్ చేరారు. మూడో రౌండ్లో స్వియాటెక్ 6-4, 6-2తో పవ్ల్యూచెంకోవాను చిత్తుచేసింది. సబలెంక 6-2, 6-1, 6-2తో అలగ్జాండ్రొవను ఓడించగా వొజ్నియాకి 6-3, 6-2తో జెస్సిక పంచెట్ (ఫ్రాన్స్)పై గెలిచింది. కోకో గాఫ్, స్వియాటెక్, పలోని, సబలెంక, జెంగ్ వంటి స్టార్ ప్లేయర్లు ప్రిక్వార్టర్స్ చేరడంతో పోరు రసవత్తరం కానుంది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న జపాన్ సహచరిణి అల్డిల ద్వయం 0-6, 7-6 (7/5), 10-7తో జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా), కటెరిన సినియాకొవ (చెక్ రిపబ్లిక్)ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.