హైదరాబాద్, జూన్ 20 (నమస్తేతెలంగాణ): పంటల కొనుగోలులో విఫలమైన అసమర్థ సీఎం రేవంత్ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను వంచించిన ఆయనకు, కాంగ్రెస్‌కు పాలనార్హత అసలే లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మాజీ మంత్రి గంగుల కమలాకర్, అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రె స్ అగ్రనేత రాహుల్‌గాంధీని తీసుకొచ్చి, వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అలవికానీ హామీలిచ్చిన రేవంత్.. గద్దెనెక్కిన తర్వాత రైతాంగాన్ని నిండా ముంచి డిక్లరేషన్‌కు ఉరివేశారని ధ్వజమెత్తారు.
నాడు అన్నదాత పండించిన ప్రతి గింజ నూ కొనుగోలు చేస్తానని బహిరంగ సభల్లో గొ ప్పలు చెప్పిన ఆయన.. రాహుల్ జన్మదినం సాక్షిగా చేతులెత్తేశారని విరుచుకుపడ్డారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గింజా కొంటాం.. విదేశాలకు పంపుతాం.. రైతులకు ఏ కష్టం రాని వ్వం’ అంటూ గప్పాలు కొట్టిన రేవంత్.. సీఎం అయ్యాక కేంద్రంపై నెపంనెట్టి తప్పించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కరోనా విపత్కర సమయంలోనూ రికార్డుస్థాయిలో 92.68 లక్షల టన్నులు కొనుగోలు చేశామని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. తమ పంటలు కొనాలని రైతాంగం అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితిలోకి కాంగ్రెస్ సర్కార్ నెట్టిందని మండిపడ్డారు. ఈ యాసంగిలో 90 లక్షల టన్నుల వడ్లు కొంటామని పదే పదే ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఆచరణలో చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. 50 లక్ష ల టన్నుల కొనుగోలుకు మూడు నెలలు పట్టిందని, రైతులు కొనుగోలు కేంద్రాలు, రోడ్ల వెంట పడిగాపులు కాయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పానలోని తొమ్మిదిన్నరేండ్లు లేని యూరియా కష్టాలు.. చేతగాని కాంగ్రెస్ పాలనలో తిరిగి ఎదురవుతున్నాయని మండిపడ్డా రు. కాంగ్రెస్ సర్కార్‌కు ఎరువుల సరఫరా చేతగాక యాప్‌ను అందుబాటులోకి తెచ్చి తప్పించుకొన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పంటలకూ క్వింటా రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని ఊరించిన కాంగ్రెస్.. చివరకు రైతులను ఏమార్చిందని విమర్శించారు. మొదట 33 రకాల సన్న వడ్లకు ఇస్తామని అసెంబ్లీలో చెప్పిన ప్రభుత్వం.. ఇప్పు డు 7 రకాలకే పరిమితం చేసిందని ఆరోపించా రు. బోనస్‌కు ఆశ పడి సన్నాలు సాగుచేస్తే ఎకరాకు రైతులు 10 క్వింటాళ్ల చొప్పున దిగుబడి కోల్పోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు.
రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఓట్ల కోసం అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్.. సగం మంది రైతులకే ఇచ్చి చేతులు దులుపుకొన్నదని దు య్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 5 సీజన్లలో కలిపి రూ.29,358 కోట్ల మేరకు రైతులకు బాకీ పడిందని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. మొదటి విడత మాత్రమే పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో జమచేసిందని, మిగతా విడతల్లో అరకొరగా అందించిందని విమర్శించారు.
సాగునీటి వినియోగంలో కాంగ్రెస్ సర్కార్ దారుణంగా విఫలమైందని విమర్శించారు. కరువును శాశ్వతంగా జయించే లక్ష్యంతో కేసీఆర్ నాడు యుద్ధప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేశారని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్‌పై కక్షతో నీటి వినియోగంపై అవగాహనలేని సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డకు మరమ్మతు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
90శాతం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేయడంలో అలసత్వం వహిస్తూ పుట్టినగడ్డకు తీరని ద్రోహానికి తలపెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ మూర్ఖత్వంతో తెలంగాణ రైతాంగం నష్టపోయే దుస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. నీటిపారుదల ప్రాజెక్టులను విస్మరించడం శోచనీయమన్నారు. సకాలంలో రూ.441 కోట్ల రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో 7,600 మంది రైతుకుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రేవంత్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమాలకర్ ధ్వజమెత్తా రు. శనివారం తెలంగాణభవన్‌లో ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అష్టకష్టాలు ఓర్చి పంటలు పండిస్తే కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో 3 నెల ల ముందు నుంచే పంటల సేకరణ ప్రణాళికాబద్ధంగా సాగేదని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ సర్కార్.. కేంద్రాన్ని సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. పంటలు సేకరించేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వదిలిపెట్టబోదని హెచ్చరించారు.
కేసీఆర్ పాలనలో ఎరువులు, విత్తనాల పంపిణీ మొదలుకొని పంటల కొనుగోళ్లదాకా పక్కా ప్రణాళికతో వ్యవహరించేందని అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పండించిన ప్రతి గింజనూ సేకరించినట్టు గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల విద్యుత్తు స రఫరా,పెట్టుబడి సాయం అమలుచేసిన ట్టు చెప్పారు. కాళేశ్వరంప్రాజెక్టుతో పంట ల ఉత్పత్తి రికార్డుస్థాయికి చేరిందని తెలిపారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 72 వేల కోట్ల రైతుబంధు జమచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 3సార్లు రైతుభరోసా ఎగ్గొట్టి కాంగ్రెస్ సర్కార్ రై తాంగాన్ని మోసం చేసిందన్నారు.