ఏటూరునాగారం, జూన్ 19 : ఏజెన్సీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంది. దీంతో ఇప్పటికీ అక్కడక్కడ పాఠశాలలు తెరుచుకోనట్లు తెలుస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 98 గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు 184 మంజూరు పోస్టులు ఉన్నాయి. కాగా, ప్రస్తు తం 108మంది ఉపాధ్యాయులు ఉండగా 74 పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీంతో పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్దుబాటు అయోమయంలో ఉన్నట్లు తెలుస్తున్నది. గతేడాది కూడా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులే లేకపోవడంతో మూతపడినట్లు తెలుస్తోంది.
పాఠశాలలు పునఃప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా ఉపాధ్యాయులను డిప్యుటేషన్ చేయకపోవడంతో కొన్ని పాఠశాలల పరిధిలోని విద్యార్థులు పొరుగున ఉన్న పాఠశాలకు వెళ్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులను దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ద్వారా ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో గతేడాది కొన్ని పాఠశాలల నిర్వహణకు ఇతర పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను పంపించారు. ఏటా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రైవేటు పాఠశాలకు తమ పిల్లలను పంపించుకునే పరిస్థితి ఏర్పడుతున్నదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రధానంగా ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం, మంగపేట, కన్నాయిగూడెం, గోవిందరావుపేట మండలాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి, వీరాపూర్, వెంకటాపురం మండలం కాలిపాక, బోధాపురం, ముత్తా రం, చిరుతపల్లి, కన్నాయిగూడెం మండ లం సర్వాయి, కన్నాయిగూడెం, గుట్టబోరు, వెంకట్రావుపల్లి, మంగపేట మండలం బొమ్మాయి గూడెం, మొట్లగూడెం, కొత్త చీపురుదుబ్బ, పాత చీపురుదుబ్బ, తిమ్మాపూర్, గోవిందరావుపేట మండలంలో పాపయ్యపల్లి, చంద్రుతండా బాలాజీ నగర్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. ఈ పాఠశాలలకు గత విద్యా సంవత్సరం డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను పంపారు. కానీ, ఈ సారి ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఆయా పే యూనిట్ హెడ్మాస్టర్ల మౌఖిక ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలకు వెళ్లి బడులు తెరిచారు.
ఇదిలా ఉండగా కన్నాయిగూడెం మండలం సర్వాయిలో రెండు సంవత్సరాలుగా ఉపాధ్యాయుడు లేక పాఠశాల తెరుచుకోవడం లేదు. ఇక వెంకట్రావుపల్లిలో పాఠశాల భవనం లేకపోవడంతో పాఠశాల నడవడం లేదని తెలుస్తున్నది. కన్నాయిగూడెం, గుట్టబోరు పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించకపోవడంతో అవి కూడా తెరుచుకోలేదు. మంగపేట మండలం పాత చీపురుదుబ్బ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు లేకపోవడంతో మూతపడినట్లు తెలుస్తోంది. వెంకటాపురం మండలం కాలిపాకలో ఇప్పటివరకు ఉపాధ్యాయుడిని నియమించలేదు.
ఇదిలా ఉండగా ఉన్నత పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు కొందరు ప్రైమరీ పాఠశాలలకు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం. అయితే గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల కొరత ఉండడంతో ప్రాథమిక పాఠశాలలకు డిప్యుటేషన్ చేయడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఖాళీలు ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపించాలని ఆయా పే యూనిట్ హెడ్మాస్టర్లను ఆదేశించినట్లు ఏటీడీవో అజయ్ కుమార్ తెలిపారు.
వీరాపూర్లోని పాఠశాల విద్యార్థులు చెల్పాకకు వెళ్తున్నారు. ఇక్కడ వెంటనే ఉపాధ్యాయులను నియమించాలి. గతేడాది మన ఊరు మన బడి స్కీం కింద రూ. 2.50లక్షలతో పాఠశాలలో మరమ్మతు పనులు చేపట్టడం జరిగింది. వెంటనే ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులు మరో బడికి వెళ్లకుండా చూడాలి. పాఠశాల తెరిచి వెంటనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలపై అధికారులు నిర్లక్ష్యం వీడాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి.
– కాపుల సమ్మయ్య, అల్లంవారి ఘనపూర్