ముంబై, ఫిబ్రవరి 4: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా మోటర్స్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం షాకిచ్చింది. భారత్‌లోకి టెస్లా కార్ల దిగుమతులపై సుంకాల్ని తగ్గించాలంటూ ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. పాక్షికంగా తయారుచేసిన కార్లను దేశంలోకి తీసుకొచ్చి, ఇక్కడి ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తే తక్కువ సుంకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) చైర్మన్ వివేక్ జోహ్రి స్పష్టంచేశారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టెస్లా ప్రతిపాదనల మేరకు సుంకాల్లో మార్పు చేసే అవసరం ఉందా అన్న అంశాన్ని తాము పరిశీలించామని, ఇప్పటికే దిగుమతి చేసుకున్న విడిభాగాలను స్థానికంగా కొన్ని వాహనాలుగా అసెంబుల్ చేస్తున్నాయని, ప్రస్తుత టారీఫ్‌లను పాటిస్తూ పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. స్థానికంగా ఉత్పత్తి చేయమంటూ టెస్లాను కేంద్రం కోరుతుండగా, దిగుమతులపై సుంకాలు తగ్గించాలంటూ మస్క్ డిమాండ్ చేస్తున్నారు. దిగుమతైన ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం వరకూ దిగుమతి సుంకం ఉండగా, దేశంలో అసెంబుల్ చేసేందుకు దిగుమతయ్యే విడిభాగాలపై 15.-30 శాతం మాత్రమే సుంకాన్ని విధిస్తున్నారు.
టెస్లా ప్రణాళిక ఇవ్వలేదు..
దేశంలో వాహనాల్ని ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక ఇవ్వాలని టెస్లాను ప్రభుత్వం కోరినప్పటికీ, ఇప్పటివరకూ అది అందలేదని జోహ్రి తెలిపారు. కేంద్రం నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు మస్క్ గత నెలలో వెల్లడించిన తర్వాత తెలంగాణలో ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయమని రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ కోరిన సంగతి తెలిసిందే. మరో వైపు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి దేశంలో ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్న మహీంద్రా, టాటా మోటార్స్ మార్గాన్ని అనుసరించాలంటూ కేంద్రం టెస్లాకు సూచిస్తున్నది.