Maha Shivaratri | సాధారణంగా మనం చేసుకునే పండుగలన్నీ విందులతో, వినోదాలతో నిండి ఉంటాయి. కానీ, ఇందుకు భిన్నంగా శివరాత్రి జరుగుతుంది. ఈ పర్వదినాన్ని పూర్తిగా ఉపవాసంతో జరుపుకొంటాం. లౌకికమైన ఆహార, విషయ వాంఛల నుంచి మనిషిని దూరంగా జరిపి, పరమేశ్వరుడికి చేరువ చేసే అంతరార్థం శివరాత్రి పర్వదినంలో కనిపిస్తుంది.
లింగోద్భవం అర్ధరాత్రి వేళ జరిగింది. అంతా తానై, అన్నిటా తానై జగత్తును నడిపించే పరమేశ్వర లింగావిర్భావ పుణ్య సమయంలో శివధ్యానంతో మనసును నింపుకొనేందుకు జాగరణ రూపంలో ఏర్పరచుకున్న నియమం అది. పరమేశ్వరుడి రాక కోసం ఒడలెల్లా కళ్లు చేసుకుని ఎదురుచూస్తూ, అనుక్షణం శివధ్యానంతో తపించేందుకు పెద్దలు ఏర్పాటుచేసిన ఆధ్యాత్మికమార్గం అది. మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రియాలు మన వశంలో ఉంటాయి. జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుడిని దర్శించడానికి భౌతిక నేత్రాలతోపాటు మనో నేత్రాలు కూడా అవసరం. అటువంటి మానసిక చైతన్యాన్ని ఎల్లప్పుడూ మనిషిలో నింపి ఉంచడంలో జాగరణ దోహదం చేస్తుంది.
మనిషిలో ఉండే అజ్ఞానానికి సంకేతం రాత్రి. జ్ఞానానికి పగలు ప్రతిరూపం. పరమేశ్వర తత్త్వాన్ని తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం. ఈ మూడింటినీ సమన్వయం చేస్తే శివతత్త్వాన్ని తెలుసుకోలేకపోవడం అనే అజ్ఞానం నుంచి మనిషిని దూరం చేసి, ఆత్మజ్ఞానం వైపు నడిపించేందుకు చేసే ప్రయత్నమే జాగరణ. రాత్రి తర్వాత వచ్చే పగలు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే, అజ్ఞానం తొలగిన తర్వాత వచ్చే విజ్ఞానం మనిషికి శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానమనే పగటి కోసం చూసే ఎదురుచూపే జాగరణ. మరొక కోణంలో ప్రాపంచికమైన ఆలోచనలకు రాత్రి ప్రతీక అని అర్థం చెప్పుకోవచ్చు. అలాంటి ఆలోచనలకు దూరంగా జరిగి, అలౌకికమైన ఆనందాన్ని అందుకోవడమే జాగరణ. ప్రాపంచికమైన చీకట్లు విడిపోవాలంటే పరమేశ్వరుడి అనుగ్రహం కావాలి. ఇందుకోసం మనిషి తపించాలి. నిరంతరం మెలకువగా (జాగరణ) ఉండాలి. అప్పుడు జీవితమంతా శివరాత్రి జాగరణే అవుతుంది.
జాగరణ అనే పదానికి జాగృతం చేసుకోవడం అనే అర్థం కూడా ఉంది. ఎవరో మనల్ని ఉద్ధరిస్తారనే పరాన్నభుక్కులాగా మనిషి అచేతనుడుగా ఉండకూడదు. మనలోని అచేతనాన్ని, దైన్యాన్ని స్వీయ జాగృతితో దూరం చేసుకోవాలి. నిరంతరం మెలకువగా (చైతన్యంగా) ఉండాలి. ‘యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ అని శంకరాచార్యులు చెప్పినట్టు, చేసే ప్రతి పనిలోనూ, వేసే ప్రతి అడుగులోనూ పరమేశ్వర తత్త్వాన్ని భావించి, ఆధ్యాత్మిక జాగరణ కలిగి ఉంటే, శివానుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది….?
-శ్రీ భారతి