సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని చీల్చుకుంటూ మరో రెండు చోట్ల భారీ వంతెనలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఒవైసీ, షేక్‌పేట జంక్షన్లలో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారంగా చేపట్టిన ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తి కాగా.. ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. వాహనదారులకు న్యూ ఇయర్ కానుకగా ఈ రెండు ఫ్లై ఓవర్లను అందించేందుకు పురపాలక శాఖ సన్నద్ధమవుతున్నది. ఈ నెల 25 తర్వాత మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ రెండు ఫ్లై ఓవర్లతో ఈ జంక్షన్లలో వాహనదారులు రయ్ రయ్ మంటూ సాగిపోనున్నాయి.
మిధాని జంక్షన్ నుంచి ఒవైసీ దవాఖాన జంక్షన్ వరకు రూ.63 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 1.40 కిలోమీటర్ల దూరం గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టారు. 12 మీటర్ల వెడల్పు, యూని డైరెక్షన్లో మూడు లైన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది.
నిర్మాణ వ్యయం – రూ. 63 కోట్లు
పనులు చేపట్టింది – బీఎస్సీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్
ఫ్లై ఓవర్ పొడవు 1365 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు
మూడు లేన్లతో యూని డైరెక్షన్లో నిర్మాణం
38 చోట్ల ఫిల్లర్లు, 33 గిల్డర్స్ గల 132 స్పన్స్ ఫిట్ చేశారు.
రేతిబౌలి నుంచి ఆరులేన్లతో షేక్ పేట్ , ఫిలింనగర్ జంక్షన్ ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించే షేక్‌పేట్ ఫ్లై ఓవర్ ఇంటర్మిడియట్ రింగ్ రోడ్ నిర్మాణం నగరంలో రెండవ అతి పెద్దదిగా నిలవనున్నది. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే తర్వాత 2.8 కిలోమీటర్ల పొడవులో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్‌తో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు మహా ఉపశమనం లభించనున్నది. నిర్మాణంలో భాగంగా 74 పిల్లర్స్, 72 పియర్ క్యాప్స్, 440 పి.ఎస్.సి గడ్డర్స్,144 కాంపోసిట్ గ్రీడర్స్ ఏర్పాటు చేశారు.