హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 నియామకాల్లో భాగంగా స్పోర్ట్స్ కోటాలోని ఏడు ఉద్యోగాలు(2%) ఓపెన్కోటాలోకి మార్చా రు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయస్థాయి క్రీడాకారులను విస్మరించి ఇంటర్నేషనల్ క్రీడాకారులే ఉద్యోగాలకు అర్హులుగా పరిగణించడం సరికాదని తప్పుబడుతున్నారు. అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు గ్రూప్-2లో అర్హత సాధించకపోవడంతో స్పోర్ట్స్ కోటాలోని ఏడు ఉద్యోగాలను ఓపెన్ కోటా కింద భర్తీ చేస్తున్నామని టీజీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.
స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఓపెన్ కోటాలోకి ట్రాన్స్ఫర్ చేయడంపై జాతీయస్థాయి క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగాల భర్తీలో ఇంటర్నేషనల్ క్రీడాకారులతోపాటు నేషనల్ క్రీడాకారులను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ నియామకాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వాలు జాతీయ స్థాయి క్రీడాకారులను సైతం స్పోర్ట్స్ కోటా పరిగణనలోకి తీసుకున్నాయని గుర్తుచేస్తున్నారు. కోర్టు న్యాయం చేసినా.. సీఎం రేవంత్రెడ్డి మాత్రం తమ అవకాశాలను కొల్లగొడుతున్నారని మండిపడుతున్నారు. హైకోర్టు తీర్పును శిరసావహించాలని డిమాండ్ చేస్తున్నారు.