‘కొన్నిసార్లు బ్రేక్ మంచిదే’ అంటున్నారు ప్రీతి శ్రీనివాస్. జీ తెలుగు ‘రామా సీతా’, ‘రావోయి చందమామ’ సీరియల్స్‌తో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తాజాగా, ‘జగద్ధాత్రి’లో న్యూస్ చానల్ సీయీవో పాత్ర పోషిస్తున్నారు. కుటుంబం, సినిమాలు, అభిమానులు.. ఇలా అనేక అంశాల గురించి ‘జిందగీ’తో ప్రీతి ముచ్చట్లు…
‘రామా సీతా’ కథానాయికగా తెలుగు ప్రేక్షకులు నన్నింకా గుర్తు పెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. గత ఏడాది జీ తెలుగు ‘పడమటి సంధ్యారాగం’లో చేశాను. అదీ కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే. ఇంటి బాధ్యతల నడుమ బెంగళూరు-హైదరాబాద్ మధ్య నిత్యం ప్రయాణించగలనా అనే భయం ఉండేది. ‘ఏం ఫర్వాలేదు..’ అని కుటుంబం ధైర్యం ఇవ్వడంతో సెకెండ్ కెరీర్ మొదలుపెట్టాను. నేను సైకాలజీలో మాస్టర్స్ చేశాను. కాలేజీ రోజుల్లో అందాల పోటీల్లో పాల్గొన్నాను. గెలుపు కిరీటమూ దక్కించుకున్నాను. దీంతో సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. బతిమాలగా బతిమాలగా.. సీరియల్స్ వరకూ ఫర్వాలేదని సడలింపు ఇచ్చారు. యాక్టింగ్ మీద ప్రేమతో.. సీరియల్ అని అబద్ధం చెప్పి ఓ కన్నడ సినిమాలో నటించాను. ఆ తర్వాత విషయం తెలిసి ఇంట్లో పెద్ద గొడవైంది. మొత్తానికి, మొదటి సినిమా ఓ తీపి అనుభవం. చుట్టూ సీనియర్ స్టార్స్, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్. అయినా, బాగానే నటించాను. అందరూ మెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత ఇంకొన్ని అవకాశాలు వచ్చినా.. పెద్దల్ని ఎదిరించే ధైర్యంలేక తిరస్కరించాను. ‘ఎలాగోలా అమ్మానాన్నలకు సర్దిచెప్పి ఉంటే.. పెద్ద స్టార్ అయ్యేదాన్ని కదా!’ అనే వెలితి మనసును తొలిచేస్తూ ఉంటుంది. అయినా, టీవీ సీరియల్స్ ద్వారా కూడా స్టార్డమ్ సాధించే అవకాశాలు ఉన్నాయిప్పుడు. ఇంతకంటే ఏం కావాలి? అంతా హ్యాపీస్. మంచి సినిమా అవకాశం వస్తే మాత్రం.. తప్పకుండా చేస్తాను.
స్కూల్ డేస్
అప్పటికి, ఇప్పటికి నేనేం పెద్దగా మారలేదు. స్కూల్ డేస్‌లో బుద్ధిమంతురాలైన విద్యార్థిని. ధ్యాసంతా ఫస్ట్ ర్యాంక్ మీదే ఉండేది. ఒక్క మార్కు తేడా వచ్చినా ఒప్పుకొనే దాన్ని కాదు. టెన్త్‌లో నాకు తొంభైనాలుగు శాతం వచ్చింది. స్కూల్ నోటీస్ బోర్డ్ మీద నా ఫొటో పెట్టారు. అయినా ఏడుపు ఆగలేదు. ఎందుకంటే, నైన్టీ నైన్ పర్సెంట్ నా టార్గెట్. దీంతో ఏడుపు తన్నుకొచ్చింది. అంతా గుమిగూడారు. ‘కొంపదీసి ఫెయిల్ అయిందా?’ అంటూ అన్నయ్యకూ సందేహం వచ్చింది. అలా పెద్ద సీన్ క్రియేట్ చేశాను. అన్నయ్యను కూడా చదువుకోమని వేధించేదాన్ని. మధ్యరాత్రి నిద్ర లేపే దాన్ని. ఎంత తిట్టుకునేవాడో. నా కుటుంబం గురించీ మీకు చెప్పాలి. మా ఆయన డయాబెటాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్. చాలా మంచి మనిషి. ‘పెళ్లి, పిల్లలు.. కెరీర్‌కు ముగింపు కానేకాదు. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకో. కాకపోతే వ్యక్తిగత-వృత్తిగత జీవితాల్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలు’ అని సలహా ఇచ్చారు. నేను చదివిన చదువుకు న్యాయం చేస్తూ.. సైకాలజీ కౌన్సెలర్‌గా కూడా సేవలు అందిస్తున్నాను.
డిప్రెషన్, ఎడిక్షన్ తదితర సమస్యలతో బాధపడుతున్నవారి జీవితాలను మార్చడం నా ధ్యేయం. నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండను. ఆన్లైన్లో లక్షమంది ఫాలోయర్స్ కంటే.. నిజ జీవితంలో నిజాయతీగా నన్ను అభిమానించేవారు ఓ పదిమంది ఉన్నా చాలని అనుకుంటాను. నా జీవన శైలి కూడా సరళంగా ఉంటుంది. హంగూ ఆర్భాటం ఇష్టం ఉండదు. నా వల్ల ఎన్ని జీవితాలు మారాయి? అనేదే నాకు కావాలి. కౌన్సెలింగ్, యాక్టింగ్‌తోపాటు కూతురిగా, భార్యగా, తల్లిగా.. నా బాధ్యతకు వందశాతం న్యాయం చేయాలనే తపిస్తాను. ఫలానా పాత్రలు చేయాలనో, ఫలానా స్టార్స్‌తో నటించాలనో నాకు కోరిక లేదు. జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలనేది నా ఫిలాసఫీ. నా తాజా సీరియల్లో ఓ పాప పాత్ర ఉంటుంది. తనతో కనిపించిన ప్రతిసారీ మా బాబులో కాస్తంత అసూయ. తనను కాకుండా.. ఇంకెవరినో మమ్మీ ముద్దు చేయడం వాడికి నచ్చదు మరి. ఫ్రెండ్స్‌తో మాత్రం ‘మా అమ్మ షూటింగ్‌కు వెళ్లింది’ అని గర్వంగా చెప్పుకొంటాడు. నాకు భ్రమణకాంక్ష ఎక్కువ. ప్రపంచమంతా తిరగడం ఇష్టం. అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇష్టపడతాను. బాలీలాంటి ఏకాంత ప్రదేశాలంటే ఇష్టం. కౌన్సెలింగ్, సీరియల్స్.. రెండు బాధ్యతలకూ న్యాయం చేయడమే నా తక్షణ కర్తవ్యం. జీ తెలుగు ‘జగద్ధాత్రి’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో నాది టీవీ చానల్ సీయీవో పాత్ర. చాలా పవర్ఫుల్ మహిళ. పేరు కౌశికి. ప్రతి స్టార్ కోరుకునే క్యారెక్టర్ ఇది. మీరు కూడా తప్పక చూడండి.
…? హరిణి