వినాయక్‌నగర్, మే 10 : ఈ నెల 13న జరగనున్న పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన భద్రత చర్యలు చేపడుతున్నట్లు సీపీ సాయిచైతన్య ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నగరంలో మొత్తం 15 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని వెల్లడించారు. సెంటర్ల పరిసరాల ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులు ఉండరాదని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాప్స్ మూసి ఉంచాలని సీపీ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, సెంటర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని సీపీ వెల్లడించారు. నిబంధలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.