హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): వయసులో తెలంగాణ చాలా చిన్న రాష్ట్రమైనప్పటికీ ఇక్కడ వివిధ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటున్న విధానం అద్భుతంగా ఉన్నదని ఢిల్లీ ఎన్నికల కమిషనర్, ఆలిండియా స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎస్కే శ్రీవాత్సవ కొనియాడారు. తెలంగాణలో అధికారిక పర్యటనకు విచ్చేసిన ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం అవలంబిస్తున్న వివిధ పద్ధతులను తెలుసుకొనేందుకు మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవాత్సవ మాట్లాడుతూ.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి, వివిధ సంసరణలను తీసుకొచ్చారని, ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంతో అభివృద్ధి సాధించాయని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ విషయాలను అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తానని చెప్పారు. ఈ ప్రక్రియను ఇదేవిధంగా కొనసాగించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయెల్.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటున్న తీరు గురించి శ్రీవాత్సవకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో వినియోగిస్తున్న టెక్నాలజీపై ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.