కెరీర్లో ఆకాశమెత్తు ఎదిగే ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌ని వదిలిపెట్టి తన మువ్వల సవ్వడిని నేలతల్లికి సమర్పించింది. రంగస్థలంపై రాణించడం కళలను ఆస్వాదించినంత సులభం కాదు. కోరికకు, ఓర్పునకు ఉండే తేడా కళాకారులకే తెలుసు. ఒక గెలుపు కోసం ఎన్ని త్యాగాలు చేయాలో! ఒక విజయం కోసం ఎన్నిసార్లు ఓడిపోవాలో!! అలాంటి ఒడుదొడుకుల జీవితాన్ని చూస్తూ పెరిగి.. అదే కళలోకి ధైర్యంగా అడుగుపెట్టింది పెన్నా సాత్విక. గజ్జె కట్టి ఆంధ్రనాట్య రీతులతో హొయలుపోతూ తెలంగాణ కళకు పేరు తెచ్చింది. పేరిణిలోనూ ‘పెన్నా మిన్న’ అనిపించుకుని కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసే ‘ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం’ గెలుచుకొచ్చింది సాత్విక. ఈ నాట్య ప్రయాణంలోని తీపి జ్ఞాపకాలను జిందగీతో పంచుకుందిలా..
మా నాన్న నార్కెట్‌పల్లి నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. అమ్మది జడ్చర్ల దగ్గర బాదేపల్లి. నేను అక్కడే పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. మా అమ్మ డాక్టర్ సువర్చల దేవి ఆంధ్రనాట్య కళాకారిణి. తెలుగు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నది. మా ఇంటి దగ్గర కూడా ఆంధ్రనాట్యం నేర్పేది. అమ్మ వల్లే చిన్నప్పుడే ఆంధ్ర నాట్యం నేర్చుకోవాలనిపించింది. స్కూల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనల్లో పాల్గొనేదాన్ని. మా టీచర్లు బాగా ప్రోత్సహించేవాళ్లు. పోటీలకు పంపేవాళ్లు.
కెరీర్‌ని నిర్మించుకునే కాలేజ్ డేస్‌లో అడుగుపెట్టాను. అప్పుడు కూడా డ్యాన్స్‌ని వదల్లేదు. మల్లారెడ్డి కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివాను. కాలేజీ నుంచి రాగానే.. బేగంపేటలో ఉండే కళాకృష్ణగారి డ్యాన్స్ స్కూల్‌కి వెళ్లేదాన్ని. సాయంత్రం తప్పకుండా రెండు, మూడు గంటలు సాధన చేసేదాన్ని. డ్యాన్స్ ప్రాక్టీస్‌కి బ్రేక్ రాకుండా చూసుకున్నాను. ఇంజినీరింగ్ తర్వాత టెక్ మహింద్రాలో జాబ్ వచ్చింది. ఉద్యోగం కారణంగా నాట్య సాధనకు సమయం చిక్కకుండా పోయింది. ఇలా లాభం లేదనుకొని నాట్యం కోసం నాలుగు నెలలకే ఉద్యోగం వదులుకోవాలని అనుకున్నాను. నా మనసులో మాట అమ్మానాన్నతో చెప్పాను. కళాకారిణిగా ఇందులో ఎన్ని కష్టాలు ఉంటాయో అమ్మకు తెలుసు. ‘ఆంధ్రనాట్యం, పేరిణికి దేశంలో అంత ఆదరణ లేదు. నిలదొక్కుకోవడం కష్టం. మేమూ ఎంతవరకు సపోర్ట్ చేయగలమో అంతేచేస్తాం. నీ కాళ్లమీద నీవు నిలబడగలను అనుకుంటేనే ముందడుగు వేయి’ అని అమ్మ చెప్పింది. ‘అమ్మను చూశావు. కాబట్టి నీకు నేను చెప్పేదేముంది?’ అని నాన్న కూడా నిర్ణయం నాకే వదిలేశారు. నా కాళ్ల మీద నిలబడగలను అనుకుని ఉద్యోగం వదిలేశాను.
ఇంట్లోనే శ్రీలాస్య అకాడమీని ప్రారంభించాను. ఇంటి దగ్గర పిల్లలకు నాట్య పాఠాలు చెబుతూనే, కళాకృష్ణగారి దగ్గర నేర్చుకుంటూ, తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏలో చేరాను. ఆ సమయంలో రవీంద్రభారతిలో జరిగిన ఆంధ్రనాట్య ప్రదర్శన నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటిదాకా వేదికలపై జరిగిన ఆంధ్రనాట్య ప్రదర్శనల్లో సోలో షోలన్నీ మగ కళాకారులవే. పేరిణి చరిత్రలో సోలో షో పెర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్నాను. రవీంద్ర భారతి వేదికపై ఆ ప్రదర్శన ఎప్పటికీ మరచిపోలేనిది. ఆంధ్రనాట్యం, పేరిణిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు నా వంతుగా కృషి చేస్తున్నాను. ఇలా ప్రదర్శనలు కొనసాగుతున్న కాలంలోనే కరోనా మొదలైంది. ఆ సమయంలో ఆన్లైన్లో చాలా కార్యక్రమాలు నిర్వహించాను. ఇప్పటికీ పిల్లలకు నేర్పిస్తూ, అప్పుడప్పుడూ కళాకృష్ణగారి దగ్గర క్లాసులకు హాజరవుతూ ఉన్నాను. పిల్లలకు ఇంటి దగ్గర నేర్పుతూ, నా కోసం సాధన చేస్తున్నాను. ఉద్యోగం మానేసినప్పుడు ఎంత పట్టుదలగా నాట్యమే జీవితం అనుకున్నానో.. అంతే ధైర్యంతో ఈ రోజుకీ పని చేస్తున్నాను. ఇప్పుడు ఆగమ, ఆస్థాన, ప్రబంధ ప్రదర్శనలతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేదికలపై ఆంధ్రనాట్యం, పేరిణి నాట్య వైభవాన్ని చాటే ప్రయాణంలో ఉన్నాను. నవజనార్దన పారిజాత ప్రదర్శనలు, ఆలయ ఉత్సవాల్లో అష్టదిక్పాలక ఆరాధానలతో బిజీగానే ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో పేరిణి, ఆంధ్రనాట్యానికి ఆదరణ పెరిగింది. కానీ, దేశంలో కూచిపూడి, భరతనాట్యానికి ఉన్నంత ఆదరణ మాత్రం వీటికి లేదనే చెప్పాలి. అంతటి గుర్తింపు దక్కాలని కళాకారిణిగా కోరుకుంటున్నాను. ఆ ప్రయత్నమే రేపటి నా ప్రయాణం. ఈనాటి సంగీత నాటక అకాడమీ పురస్కారం నా కృషికి గుర్తింపును మాత్రమే కాదు నా సంకల్పానికీ బలాన్నిచ్చింది.
తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ అడ్మిషన్ వచ్చింది. ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరాను. రంగస్థలంపై కంటే వృత్తి జీవితంలో అనేక పాత్రలు పోషిస్తూ వస్తున్నాను. ఈలోగా పెండ్లి కుదిరింది. అప్పుడూ కూడా నృత్యమే నా భవిష్యత్ అన్నాను. సరే నీ ఇష్టాన్ని కాదమని చెప్పారు. మెట్టినింట్లో నా ఇష్టానికి ఇబ్బంది రాలేదు. పుట్టింట పెట్టిన అకాడమీని కూడా మెట్టినింటికి మార్చాను. మా ఆయన స్టార్టప్ కంపెనీలో క్లయింట్ రీసెర్చర్‌గా పని చేస్తున్నారు. చదువుకి, డ్యాన్స్‌కి పెళ్లి ఆటంకం కాలేదు. మా అత్తగారు రేణుకా ప్రభాకర్ కూచిపూడి కళాకారిణి కావడం వల్ల నా ప్రయత్నాలను అర్థం చేసుకున్నారు. కుటుంబం మద్దతుగా నిలిచింది.
– నాగవర్ధన్ రాయల