షాద్‌నగర్/నందిగామ, జనవరి 3 : యోగా శిక్షణలో కొత్త నైపుణ్యాన్ని నెలకొల్పడానికి హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేనేషనల్ యోగా అకాడమీ సహకరిస్తుందని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి సర్భానందసోనోవాల్ అన్నారు. సోమవారం సాయంత్రం నందిగామ మండలం కన్హాశాంతి వనం గ్రామంలోని రామచంద్రమిషన్ యోగా ఆడిటోరియంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా అకాడమీ, 75కోట్ల సూర్య నమస్కాల ప్రాజెక్ట్, అథెంటిక్ యోగా పుస్తకం ప్రారంభోత్సవంలో ఆయన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, యోగా గురువు రామ్‌దేవ్‌బాబా, రామచంద్రమిషన్ అధ్యక్షుడు దాజీతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యోగా స్ఫూర్తిని ప్రపంచానికి అందించడానికి హార్ట్ఫుల్నెస్ అకాడమీ సహకరిస్తుందని చెప్పారు. యోగాను జీవితంలో అంతర్భాగంగా స్వీకరించాలన్నారు. 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్‌ను ప్రపంచానికి యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పేలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పీవై దేశ్‌పాండే రచించిన ది అథెంటిక్ ఆఫ్ యోగా పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. యోగాపై అవగాహన పెంచుకుని జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని కోరారు. అనంతరం యోగా గురువు రామ్‌దేవ్‌బాబా ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు యోగాసనాలు చేశారు.