Sanjay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు, దర్శకుడు జాసన్ సంజయ్ తొలిసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన జీవితంలో ఒకే ఒక్క ప్రేమకథ ఉందని, అది కూడా కాలేజీ రోజుల్లోనే జరిగిందని చెప్పారు. సుమారు ఏడాదిన్నర పాటు కొనసాగిన ఆ బంధం.. ఇద్దరి పరస్పర అంగీకారంతో ముగిసిందని తెలిపారు. బ్రేకప్ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టానని జాసన్ సంజయ్ వెల్లడించారు. తన ప్రేమకథ గురించి మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో ఒకే ఒక ప్రేమకథ ఉంది. అది కూడా కాలేజీ రోజుల్లోనే. మేమిద్దరం సుమారు ఏడాదిన్నర పాటు ప్రేమలో ఉన్నాం. నేను విదేశాల్లో చదువుకుంటున్న సమయంలో మా మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ఇద్దరం మాట్లాడుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నాం’’ అని జాసన్ సంజయ్ చెప్పారు.
బ్రేకప్ నుంచి ఎలా బయటపడ్డారనే ప్రశ్నకు కూడా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో యువన్ శంకర్ రాజా ప్రేమ పాటలు ఎక్కువగా వింటూ ఉండేవాడినని చెప్పారు. అంతేకాకుండా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి స్టోరీలు పెట్టలేదని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెడితే గత జ్ఞాపకాల్లోనే చిక్కుకుపోయే అవకాశం ఉందని భావించినట్లు జాసన్ సంజయ్ చెప్పారు. అందుకే తామిద్దరం కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. గతాన్ని వదిలేసి జీవితంలో ముందుకు సాగుతున్నానని చెప్పారు. బ్రేకప్ తర్వాత తన పూర్తి దృష్టిని సినిమాలపైనే పెట్టినట్లు వెల్లడించారు.
ఇక జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’ సినిమాలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న ‘సిగ్మా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడిగా తన కెరీర్ స్ట్రాంగ్ చేసుకునే పనిలో ఉన్న జాసన్ సంజయ్.. తాజాగా తన వ్యక్తిగత జీవితంలోని ప్రేమ, బ్రేకప్ విషయాలను పంచుకోవడంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.