Bala Krishna | నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాదా’ షూటింగ్ మళ్లీ ఊపందుకోనుంది. ఇటీవల యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో గాయపడిన బాలయ్య.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. వైద్యుల సూచనల మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకున్న ఆయన.. రేపటి నుంచే తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. దీంతో పెండింగ్‌లో ఉన్న సన్నివేశాలను పూర్తి చేసేందుకు చిత్రబృందం కొత్త షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. ‘దాదా’ చిత్రానికి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలను కాకినాడ పోర్ట్ పరిసరాల్లో చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ కాలికి గాయమైన విషయం తెలిసిందే. మోకాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు.
ప్రస్తుతం బాలయ్య గాయం నుంచి పూర్తిగా కోలుకుని షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో చిత్రబృందం కూడా ఊపిరి పీల్చుకుంది. బాలకృష్ణ తిరిగి సెట్స్‌లోకి రావడంతో షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించారు. బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకోవడంతో ‘దాదా’పై ఆసక్తి మరింత పెరిగింది.వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
బాలకృష్ణ గాయపడటంతో షూటింగ్‌కు కొంత విరామం వచ్చినప్పటికీ.. సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని చిత్రబృందం స్పష్టం చేసినట్లు సమాచారం. ముందుగా ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ పనులను వేగవంతం చేస్తున్నారు. బాలయ్య తిరిగి షూటింగ్‌లోకి అడుగుపెట్టడంతో ‘దాదా’పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.