న్యూఢిల్లీ: ప్రతి కొత్త మొబైల్ ఫోన్లో 90 రోజుల్లోగా తొలగించడానికి వీల్లేని ప్రభుత్వ సైబర్‌సెక్యూరిటీ యాప్ సంచార్ సాథీని అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ముందుగానే లోడ్ చేయాలని కేంద్ర టెలికం శాఖ అనధికారిక ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్‌తోపాటు వ్యక్తిగత గోప్యత పరిరక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద టెలిఫోన్ మార్కెట్లలో ఒకటైన భారత్‌లో 120 కోట్ల మందికిపైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన పంచార్ సాథీ సాయంతో 7 లక్షలకు పైగా పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ కాగా ఒక్క అక్టోబర్‌లోనే 50,000 ఫోన్లు స్వాధీనం అయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
యాంటీ-స్పామ్ మొబైల్ యాప్‌ని ప్రభుత్వమే తయారు చేయడంపై టెలికం రెగ్యులేటర్‌పై గతంలో అసహనం వ్యక్తం చేసిన యాపిల్ కొత్త టాబ్ని ప్రారంభించగా శామ్సంగ్, వివో, షియోమి కూడా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొత్త టాబ్‌ను ప్రారంభించాయి. నవంబర్ 28న ప్రభుత్వం ప్రైవేటుగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ యాప్‌ను ముందుగానే కొత్త మొబైల్ ఫోన్లలో 90 రోజుల్లోపల ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ యాప్ యూజర్లు డిజేబుల్ చేసే అవకాశం ఎంతమాత్రం ఉండదు. అయితే ఇప్పటికే మార్కెట్లోకి వెళ్లిపోయిన కొత్త మొబైల్ ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా తయారీదారులు ఈ యాప్‌ను పంపించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులో ఆదేశించింది. ఈ ఉత్తర్వును అధికారికంగా విడుదల చేయని ప్రభుత్వం కొన్ని కంపెనీలకు మాత్రమే ప్రైవేటుగా పంపినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది.
యూజర్లకే వదిలేయాలి!
యాపిల్ తాను తయారుచేసే మొబైల్ ఫోన్లలో తన సొంత యాప్‌లను మాత్రమే ఇన్స్టాల్ చేస్తుంది. ప్రభుత్వానికి చెందిన లేదా మూడవ పార్టీకి చెందిన ఏ యాప్‌ని స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి ముందు ఇన్స్టాల్ చేయడానికి ఆ కంపెనీ అంతర్గత నిబంధనలు అనుమతించవని కంపెనీ వర్గాలు తెలిపాయి. తప్పనిసరిగా తాము ముందుగానే యాప్‌ని ఇన్స్టాల్ చేయడానికి బదులుగా కొత్త ఫోన్లు కొనుక్కున్న యాజర్లు యాప్‌ని ఇన్స్టాల్ చేసుకునే అవకాశాన్ని వారికే ఇవ్వాలని యాపిల్ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది. చోరీకి గురైన ఫోన్లకు నెట్వర్క్ యాక్సెస్ తొలగించేందుకు సాధారణంగా 14-17 అంకెల విశిష్ట నంబర్‌ను(ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ-ఐఎంఈఐ) ఒక్కో హ్యాండ్‌సెట్‌కు ఉపయోగించడం జరుగుతుంది. ప్రభుత్వ యాప్ వల్ల యూజర్లు తమకు వచ్చే అనుమానాస్పద కాల్స్‌పై రిపోర్టు చేయడం, ఐఎంఈఐలను ధ్రువీకరించుకుని చోరీకి గురైన ఫోన్లను సెంట్రల్ రిజిస్ట్రీ ద్వారా బ్లాక్ చేసేందుకు అవకాశం కలుగుతుంది.