న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 : సామ్సంగ్.. దేశీయ వినియోగదారులకు షాకిచ్చింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఎస్26 సిరీస్ మాడళ్ల ధరలను 17 శాతం వరకు పెంచింది. దీంతో గెలాక్సీ ఎస్26 సిరీస్ బేసిక్ మాడల్ 256 జీబీ సామర్థ్యం కలిగిన మొబైల్ ధర రూ.1,02,999కి చేరుకున్నది. మొదట్లో ధర రూ.87,999గానే ఉన్నది. ఎస్26 అల్ట్రా ధర కూడా రూ.1,39,999 నుంచి రూ.1,54,999కి సవరించింది. అల్ట్రా 512 జీబీ స్టోరేజ్ మాడల్ ధర 9.4 శాతం పెరుగడంతో విలువ రూ.1,74,999కి చేరుకున్నది. మెమొరీ చిప్‌లు, మదర్‌బోర్డు, ఇతరత్రా ధరలు పెరుగడం వల్లనే ధరల పెంపు అని తెలుస్తున్నది.
ఎయిర్ కండీషనర్ల ధరలను 5 శాతం నుంచి 7 శాతం వరకు పెంచుతున్నట్టు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో ఈ నిర్ణయం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే ముడి సరుకుల ధరలు, రవాణా, ఇంధన వ్యయాలు పెరుగడంతోపాటు విదేశీ మారకం రేట్లలో మార్పుల కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కాగా, టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్, ఇతర ఉత్పత్తుల ధరలపై ఎలాంటి పెంపూ లేదు.