ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ వినియోగదారుల ఆశలన్నీ.. సామ్సంగ్ మోడల్స్‌పైనే! అందుకు తగ్గట్టుగానే ఈ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ స్మార్ట్ఫోన్లను తయారు చేస్తుంటుంది. ఇప్పుడు కూడా.. తన తదుపరి ఫ్లాగ్షిప్ లైనప్ గెలాక్సీ ఎస్26, ఎస్26 ప్లస్, ఎస్26 అల్ట్రాను తీసుకురానున్నది. ఇందుకు సంబంధించి కొత్త లీక్‌లు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ మోడల్స్‌లో వావ్! అనిపించే ఫీచర్.. ప్రైవసీ డిస్ప్లే. అంటే, పక్కన ఉన్నవారు ఫోన్స్క్రీన్ను చూడలేరు. దీనిగురించి సామ్సంగ్ కూడా ఇప్పటికే ఓ ప్రకటన చేసింది కూడా. మీ ఫోన్‌ను షోల్డర్ సర్ఫింగ్ నుంచి రక్షించడానికి సామ్సంగ్ త్వరలో కొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తున్నట్లు చెప్పింది. ఈ సిరీస్‌లో శాటిలైట్ ఆధారిత సందేశాలు, అత్యవసర సహాయాలు పొందే అవకాశం కూడా ఉన్నది. శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్లో స్పేస్ (ఎస్సీఎస్), నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌ల (ఎన్టీఎన్) నుంచి అనుబంధ కవరేజ్ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ లీక్‌ల ప్రకారం.. గెలాక్సీ ఎస్26, ఎస్26 ప్లస్.. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తోపాటు ఎక్సినోస్ 2600 చిప్‌తో రాబోతున్నాయి. అయితే గెలాక్సీ ఎస్26 అల్ట్రా మాత్రం.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్5ని ఉపయోగిస్తుంది. గెలాక్సీ ఎస్26 అల్ట్రా ప్రధాన కెమెరా.. 5ఎక్స్ టెలిఫొటోతో రాబోతున్నది. ప్రధాన లెన్స్ f/1.4కి మారుతుందని, టెలిఫోటో f/2.9కి మారుతుందని చెబుతున్నారు. ఇది సెన్సర్లోకి ఎక్కువ కాంతిని అనుమతిస్తుంది. తక్కువ కాంతిలోనూ అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5తో ఈ ఫోన్లు పనిచేయనున్నాయి. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ మోడల్స్‌పై ఏడేళ్లపాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ లభిస్తాయి.