Sameera Sharif | ఇటీవల కాలంలో సమాజాన్ని కుదిపేస్తున్న అంశాల్లో ఒకటి మహిళలు, బాలికలు, చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు. ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు పోక్సో వంటి కఠిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, అసలు సమస్యను రూట్లోనే అడ్డుకోవాలంటే చిన్న వయసులోనే పిల్లలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీరియల్ నటి సమీరా షరీఫ్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి చిన్నతనంలోనే పిల్లలకు వివరంగా చెప్పాలని ఆమె సూచించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా షరీఫ్, ఈ అంశంపై మాట్లాడుతూ తన చిన్ననాటి జీవితంలో ఎదుర్కొన్న బాధాకర అనుభవాన్ని తొలిసారి బహిర్గతం చేశారు. చిన్నప్పుడు తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకుంటూ, అప్పట్లో వాటి అర్థం కూడా తనకు తెలియలేదని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు.
సమీరా మాట్లాడుతూ… నా చిన్నతనంలో మేము రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. మా ఎదురింట్లో ఉన్న ఆంటీ ఇంటికి బంధువులు వచ్చేవారు. వారిలో ఒక అంకుల్ నన్ను బుగ్గలు గిల్లడం, ముద్దు చేయడం చేసేవారు. అప్పట్లో అది ఏంటో నాకు అర్థం కాలేదు. చిన్నపిల్లలం కదా… పెద్దవాళ్లు అలా చేస్తే సాధారణమే అనుకునేదాన్ని అని చెప్పారు. అంతేకాదు, దాగుడుమూతల ఆటలో భాగంగా జరిగిన మరో సంఘటనను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. మేమంతా కలిసి దాగుడుమూతలు ఆడేవాళ్లం. ఆ అంకుల్ కూడా ఆ ఆటలో జాయిన్ అయ్యేవారు. దాక్కోవడానికి మేము టెర్రస్‌కి వెళ్లేవాళ్లం. అక్కడ ఎవరూ రారు కాబట్టి, నన్ను అక్కడికి తీసుకెళ్లి ముద్దు చేసేవారు. అది నాకు ఇబ్బందిగా అనిపించినా, చిన్నతనం వల్ల తను నన్ను ప్రేమగా అలా చేస్తున్నాడేమో అనుకునేదాన్ని. కానీ పెద్దయ్యాక అర్థమైంది… అతను తన కోరికలు తీర్చుకునేవాడని అని సమీరా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అనుభవం ఆధారంగా ఆమె.. తల్లిదండ్రులకు, పెద్దలకు కీలక సూచన చేశారు. పిల్లలకు చిన్న వయసులోనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరంగా చెప్పాలి. ఎవరు ఎలా ప్రవర్తించినా అది తప్పు అని గుర్తించే శక్తి వాళ్లకు రావాలి. ఏదైనా ఇబ్బంది ఎదురైతే భయపడకుండా చెప్పుకునేలా ధైర్యం ఇవ్వాలి. ‘నువ్వు చెప్పితే మేమున్నాం, నీకు సపోర్ట్ చేస్తాం’ అనే భరోసా పిల్లలకు చాలా అవసరం” అని స్పష్టంగా చెప్పారు. సమీరా షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. చాలా మంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ, ఇలాంటి విషయాలపై ఓపెన్‌గా మాట్లాడటం వల్లే సమాజంలో మార్పు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో, తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని, పిల్లలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.