అగ్రనటి సమంత రూత్‌ప్రభు రూట్ మార్చారు. ఇన్నాళ్లూ స్టార్ హీరోల పక్కన ఆడిపాడి, స్టార్ హీరోయిన్ అనిపించుకున్న సామ్.. ఇకనుంచి ఆ తరహా సినిమాలు చేయకూడదని నిశ్చయించారట. కథానాయిక ప్రధానంగా ఆమె నటించిన యూ-టర్న్, ఓ బేబీ సినిమాలు బాగా ఆడాయి. త్వరలో ‘మా ఇంటి బంగారం’ అంటూ మరో లేడీ ఓరియెంటెడ్ కథతో ఆమె రాబోతున్నది.
ఇక నుంచి ఇలాగే కేవలం మహిళా ప్రధాన కథల్లోనే నటించాలని, నటిగా తన ప్రతిభని నిరూపించుకునే అవకాశం ఇలాంటి సినిమాల ద్వారానే ఉంటుందని, స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో నటించి, పాటలకే పరిమితం కాలేనని సామ్ భావిస్తున్నారట.
సమంత లాంటి స్టార్.. సోలో సినిమాలు చేసి హిట్లు కొడితే, అది తోటి హీరోయిన్లకు స్ఫూర్తి దాయకమే. కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా కొత్తకథలు వచ్చే అవకాశం కూడా ఉంది. త్వరలో రానున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా ఓ సామాన్య మహిళ ఎదుర్కొనే సవాళ్లు, ఆమె సాధించే విజయాల నేపథ్యంలో ఉంటుందట.