హీరోయిజాన్ని పతాకస్థాయిలో ఆవిష్కరిస్తూ దక్షిణాది చిత్రాలు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయని ప్రశంసించారు బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్‌ఖాన్. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాది సినిమాలపై సల్మాన్ ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాది సినిమాలు హిందీలో అద్భుత విజయాలు సాధిస్తున్నాయని..హిందీ సినిమాలు మాత్రం దక్షిణాది ప్రేక్షకుల్ని ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నాయో అర్థం కావట్లేదని అన్నారు. ‘దక్షిణాదిలో హీరోయిజాన్ని శిఖరస్థాయిలో ఆవిష్కరిస్తూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు. భారీ అభిమానగణం కూడా సినిమాల విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నది. బాలీవుడ్ సినిమా ముంబయి అర్బన్ పరిధిని దాటి ఆలోచించలేకపోతున్నది. దక్షిణాది తరహాలో మూలాల్లోకి వెళ్లి కథల్ని అన్వేషించాలి. వారిని చూసి నేర్చుకోవాలి’ అని సల్మాన్‌ఖాన్ పేర్కొన్నారు.