తెలుగు భాష ప్రాచీన సాహిత్య ప్రక్రియల్లో ‘శతక ప్రక్రియ’ చెప్పుకోదగినది. ఈ ప్రక్రియలో ఎంతోమంది కవులు ఇప్పటికే ఎన్నోరకాల రచనలు చేశారు. అందుకే, పద్య ప్రక్రియ నిత్య నూతనంగా ఇప్పటికీ వెలుగొందుతూనే ఉన్నది. పద్యం రాయడానికి ఛందో పరిజ్ఞానంతో పాటు భాషపై పట్టు కూడా ఉండాలి. అలాంటి పట్టును భాషపై సాధించి చక్కని పద్యరచన చేస్తున్నారు కవి తిప్పారపు లక్ష్మీ నర్సయాచార్యులు. ఇతని పద్యాలలో పద కూర్పు, భావ సౌందర్యం మనోరంజకంగా ఉంటుంది. అంతేకాదు, కవి తిప్పారపు పలు సాహిత్య సమూహాల్లో తమ సాహిత్య సేవలను అందిస్తున్నారు. తిప్పారపు రాస్తున్న పద్యాలు వర్తమాన కవులకు ఆదర్శంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన తిప్పారపు లక్ష్మీ నర్సయాచార్యులు ఇప్పటికే ‘వేంకటరమణ’, ‘లలితాస్తుతి’ శతకాలను వెలువరించారు. ఇప్పుడు ‘కృష్ణా! శతకం’ను సాహితీ లోకానికి పరిచయం చేశారు. రచయిత విష్ణు సహస్రనామ పారాయణం చేసి అమూలాగ్రం ఒంటబట్టించుకొని దానిలోని విష్ణు పరమైన శబ్దాలను గ్రహించి తన పద్య భావాలలో కూర్చారు. ‘కృష్ణా!’ అనే సంబోధనతో చక్కని శతకాన్ని కంద పద్యాలతో కూర్చారు. మచ్చుకు ఒక పద్యాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించుకుందాం.
లోకాధ్యక్షుడవీనే
సాకారా శాశ్వతాయ సన్నుత రూపా
నైకాత్మ శిపివిష్టా
శ్రీకాంతా దండమయ్య శ్రీమత కృష్ణా!!
‘కృష్ణా నీవు లోకాలను చూసేవాడివి. పలురూపాల్లో వెలిగేవాడివి. ప్రసన్నవదనం కలవాడివైన నీకు మొక్కుతున్నాను’ అంటూ తన భక్తి విశ్వాసంలో ప్రకటించారు. పద్య కవిత్వంలో కవి తిప్పారపు లక్ష్మీ నర్సయాచార్యులు ఆరితేరినవాడు కాబట్టే ఈ శతకాన్ని అవలీలగా రాశారు. ఈ పుస్తకం చదివేవారు ఆ కృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని సందర్శించుకుంటారు. ఇతరులకు ఉపకారం చేయాలని తపిస్తూ ‘లోకాన్ని రక్షించు కృష్ణా!’ అని రచయిత ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకున్నారు. ఈ భక్తి శతకాన్ని అర్థవంతమైన భావ సమన్వయంతో కూర్చిన తీరు అద్వితీయం, అమోఘం, అనిర్వచనీయం. కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ శతకం నూటికి నూరుపాళ్లు ఉపయోగపడుతుంది.