
ప్రభుత్వ వైద్యంలో అనూహ్య మార్పులొస్తున్నాయి. ప్రైవేటుకు దీటుగా వైద్యం అందించడమే కాదు.. వేగంగా నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. నయాపైసా ఖర్చు లేకుండా సత్వరమే చికిత్స అందిస్తుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భరోసాతో ఆర్థికంగా ఊరట లభిస్తున్నది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్‌లో కొత్తగా వెంటిలేటర్, ఐసీ యూ, సాధారణ పడకలు పెంచడంతో మరింతమందికి వైద్యం అందుతోంది. రూ.12.5 కోట్లతో నిమ్స్ దవాఖానలో ఆధునిక వైద్య పరికరాలు, ల్యాబ్‌లు ఈనెల 7న అందుబాటులోకి వచ్చాయి. ఎముకల సాంద్రత, పటిష్టతను పరిశీలించేందుకు బోన్ డెన్సిటీ ల్యాబ్‌ను దక్షిణభారత్‌లోనే నిమ్స్‌లో ఏర్పాటు చేయడం విశేషం. తాజాగా శనివారం గాంధీ దవాఖానలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ యంత్రాన్ని మంత్రులు హరీశ్‌రావు, తలసాని, మహమూద్‌అలీ ప్రారంభించారు.
ఆధునిక యంత్రాన్ని ప్రారంభించిన మంత్రులు హరీశ్‌రావు, తలసాని, మహమూద్ ఆలీ
కరోనా సమయంలో గాంధీ వైద్యులు, సిబ్బంది అందించిన సేవలపై ప్రశంసలు
సమస్యలపై వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష
బన్సీలాల్‌పేట్ డిసెంబర్ 11: సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో రెండు కోట్ల రూపాయలతో బయటి రోగుల విభాగంలో ఏర్పాటు చేసిన నూతన ఆధునిక సీటీ స్కాన్ యంత్రాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోమ్, జైళ్ళ శాఖ మంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలు కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రితం పర్యటించి, గాంధీ దవాఖానకు 176 కోట్ల ను మంజూరు చేశారని, అందులో 100 కోట్ల పనులు మొదలయ్యాయని అన్నారు. 12.5 కోట్ల తో త్వరలో ఎంఆర్ఐ యంత్రాన్ని సమకూరుస్తామన్నారు. అలాగే, మరో 45 రోజుల్లో క్యాత్ ల్యా బ్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. మాతా, శిశు సంక్షేమ కోసం 200 బెడ్లతో కూడిన ఎంసీహెచ్ దవాఖాన నూతన భవనం మరో ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కరోనాలో 87 వేల మంది రోగులకు మెరుగైన వైద్యం అం దించి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్లు, నర్సులు, సిబ్బం ది సేవలు అభినందనీయమని అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్ రెడ్డి, బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, డీఎంఈ డాక్టర్ కే.రమేశ్‌రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారా వు, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నర్సింహారావు నేత, డాక్టర్ శోభన్‌బాబు, ఆర్‌ఎంఓలు డాక్టర్లు జయకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, ప్రభుకిరణ్, పలు విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు.
సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష
గాంధీ వైద్య కళాశాలలోని మైక్రో బయాలజీ విభాగం సెమినార్ హాలులో వివిధ విభాగాల హెచ్ఓడీలతో మంత్రి టి.హరీశ్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్లు డాక్టర్ నాగమణి, డాక్టర్ సులేమాన్‌లు ముందుగా పలు పాలనా పరమైన సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు మాట్లాడుతూ 1015 బెడ్ల సామర్థ్యం కలిగిన దవాఖానలో రోగుల సంఖ్య రెండు వేలకు దాటిందన్నారు. దవాఖాన సెల్లార్లో డ్రైనేజీ నీరు నిండిపోవడం, సిబ్బంది నియామకం లేకపోవడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల నివారణ వ్యవస్థ ఏర్పాటు, కీలమైన వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్ట్‌లు, దవాఖాన ఆవరణలో అద్దెలు చెల్లించని దుకాణాల సమస్య, సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని, రికార్డులను కంప్యూటరైజ్ చేసే ప్రక్రియ లాంటి పలు సమస్యలను మంత్రికి వివరించారు. అన్నింటిని సానుకూలంగా విన్న మంత్రి హరీశ్‌రావు తప్పకుండా ప్రాధ్యానతా క్రమంలో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు.
వార్డుల సందర్శన
సీటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించిన అనంతరం, మంత్రి హరీశ్ రావు దవాఖానలోని ముఖ్యమైన వార్డులలో పర్యటించారు. గాం ధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఇతర అధికారులతో కలసి అత్యవసర విభాగం వద్దకు వెళ్ళారు. రోగులను, సహాయకులను పలకరించారు. క్యాజువాలిటి వార్డులోకి వెళ్ళి, రోగుల ను పలకరిస్తూ, అక్కడ ఉన్న ఇతర సదుపాయాలను పరిశీలించారు. అక్కడి నుంచి మూడో అంతస్తులోని 60 బెడ్ల సామర్థ్యం కలిగిన ఏఎంసీ వార్డులోకి వెళ్ళారు. రోగులతో మాట్లాడారు.