పుట్టపర్తి, నవంబర్ 22: పాలకులు తాము తీసుకున్న నిర్ణయాలు మంచివేనా, వాటిలో ఏవైనా చెడు లక్షణాలు ఉన్నాయా అని ప్రతిరోజూ ఆత్మపరిశీలన చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, ప్రభుత్వం తీసుకొనే ఏ నిర్ణయమేనా వారికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని హితవు పలికారు. మహాభారతం, రామాయణాన్ని ఉటంకిస్తూ 14 దుర్లక్షణాలను పాలకులు వదిలించుకోవాలని చెప్పారు. ఏపీలోని పుట్టపర్తిలో ‘శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్’ స్నాతకోత్సవంలో సీజేఐ రమణ ప్రసంగించారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులందరూ తమ దినచర్య ప్రారంభించే ముందు తమలో ఏమైనా దుర్లక్షణాలు ఉన్నాయా అని ఆత్మపరీక్ష చేసుకోవాలి. వారు ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలన అందిస్తే చాలు. ఇక్కడ అనేకమంది వివేకవంతులు ఉన్నారు. ప్రపంచంలో, దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను మీరు గమనిస్తూనే ఉన్నార’ని వ్యాఖ్యానించారు.
దేశంలో అన్ని వ్యవస్థలు ప్రజలకు సేవలందించే లక్ష్యంతో స్వతంత్రంగా నిజాయితీగా ఉండాలన్నదే తన అభిలాష అని జస్టిస్ రమణ తెలిపారు. ఇదే విషయం సత్యసాయి కూడా చెబుతుండేవారని గుర్తుచేశారు. ఆధునిక విద్యా వ్యవస్థ ప్రయోజనవాదంపైనే దృష్టి సారిస్తున్నదని, అందువల్ల విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, వారికి సామాజిక స్పృహ, బాధ్యతను అలవర్చే నైతిక, ఆధ్యాత్మిక విద్య కొరవడుతున్నదన్నారు. ‘నైతిక విలువలు, వినయం, క్రమశిక్షణ, నిస్వార్థం, దయ, సహనం, క్షమాగుణం, పరస్పర గౌరవాన్ని అలవర్చేదే నిజమైన విద్య’ అని చెప్పారు.
సత్యసాయి బాబాను దర్శించుకొనే భాగ్యం తనకు కలిగిందని సీజేఐ గుర్తుచేసుకున్నారు. సత్యసాయి అంటే ప్రేమ, సేవ, త్యాగమని చెప్పారు. విద్యా వైద్య రంగాల్లో, తాగునీటి సరఫరా, సహాయ చర్యల్లో సత్యసాయి సేవలను కొనియాడుతూ బాబా మనందరికీ సరైన మార్గాన్ని చూపించారని చెప్పారు. బాబా జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. గత రెండేండ్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని, వేళ్లూనుకున్న దౌర్భల్యాలను కరోనా బయటపెట్టిందని, అసమానతలను పెంచిందని చెప్పారు.