హైదరాబాద్ : టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC ) బస్‌లో గుండెపోటు వచ్చిన ప్రయాణికుడికి సీపీఆర్ చేసి కాపాడిన కండక్టర్, డ్రైవర్‌ను ఎండీ వీసీ సజ్జనర్( MD Sajjanar ) అభినందించారు. హైదరాబాద్ బస్ భవన్లో శనివారం జీడిమెట్ల డిపోనకు చెందిన కండక్టర్ అంజలి, డ్రైవర్ సైదులును ఉన్నతాధికారులతో కలిసి సన్మానించి బహుమతిని అందజేశారు.
ఆపదలో ఉన్న ప్రయాణికుడిని సేవాతత్పరతో కాపాడడం గొప్ప విషయమని అన్నారు.ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు, ఆపదలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నారని సిబ్బందిని అభినందించారు.
జీడిమెట్ల డిపోనకు చెందిన మెట్రో బస్ శుక్రవారం బాలానగర్ నుంచి బహదూర్‌పల్లి వైపునకు వెళ్తుండగా ఐడీపీల్ బస్ స్టాప్ వద్ద ఎక్కిన మురళీకృష్ణ అనే ప్రయాణికుడికి బస్‌లో గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని కండక్టర్ అంజలి గుర్తించి, డ్రైవర్ సైదులును అప్రమత్తం చేసి బస్సును ఆపించారు. మరో ప్రయాణికుడి సాయంతో మురళీకృష్ణకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషాదేవి, జీడిమెట్ల డిపో మేనేజర్ అంజనేయులు, తదితరులు ఉన్నారు.