హైదరాబాద్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆటో కార్మికులు ఆటోల బందు ( Auto Strike ) కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ( RTC ) స్పందించింది. సమ్మెల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి ( MD Nagi Reddy ) తెలిపారు.
సాధారణ ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.ఆర్టీసీ నిర్ణయాలకు, ఆటో రంగానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా , ఇతర మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాన్ని ఆటో డ్రైవర్లు ఎవరూ నమ్మవద్దని కోరారు. ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సిబ్బంది సమర్థవంతంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సు సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.