హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఇలాకా అయిన వంగూరు మండల పరిధిలోని ఎస్సీ ప్రజాప్రతినిధులు, మహిళలపై తీవ్ర వివక్ష కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఆ మండలంలోని జాజాల గ్రామ సర్పంచ్ కాశమ్మ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని, శాసనసభ స్పీకర్‌పై చూపుతున్న శ్రద్ధ ఆమెపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.
సీఎం గారూ మీలోని అపర దళిత ప్రేమికుడు ఎక్కడ? అని ఎద్దేవా చేశారు. ఎస్సీలపై వివక్ష విషయంలో సిట్‌ను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని, సుమోటోగా ఎందుకు కేసు నమోదు కావడం లేదని శుక్రవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. సీఎం ఏజెంట్ నరేందర్‌రెడ్డి మాఫియా విచ్చలవిడిగా ఇసుక దందా చేస్తున్నదని సర్పంచ్ ఆరోపించారని, ఆమె చేసిన ఆ వ్యాఖ్యల వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
విజిలెన్స్ అధికారులు ఎకడున్నారు? వంగూరులో పెద్దఎత్తున పేరుకుపోయిన ఇసుక మేటలు అధికారులకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని పేర్కొన్నారు. వేముల వీరేశం, సీతక, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌రెడ్డి, కాంక్షారెడ్డి ఎకడ ఉన్నారని ప్రశ్నించారు. గజ్వేల్‌లో చేయని నేరానికి మూడు కేసులు నమోదు చేశారని ఆరోపించిన ప్రవీణ్.. ఇసుకదందాపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు అదే తరహాలో చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.