ఊట్కూర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల్లో ( Lift Irrigations ) భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులుగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రస్తుతం బయట మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు రూ. 60 లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తేనే తమ భూములను ప్రాజెక్టుకు అప్పగిస్తామని అధికారులకు వివరించారు.
భూ సేకరణ సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో సోమవారం నారాయణపేట ఆర్డీవో రామచందర్ ( RDO Ramchander ) ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బాపురం, తిప్రాస్ పల్లి, పులిమామిడి, జీర్ణహళ్లి, పెద్దపొర్ల గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలకు రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. ఆయా గ్రామాల రెవెన్యూ శివారులోని వ్యవసాయ పొలాలలో ప్రారంభించే ఓపెన్ కెనాల్, పైపులైన్, పంప్ హౌస్, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాలలో భాగంగా భూములు కోల్పోయే రైతుల వివరాలను గ్రామసభలో చదివి వినిపించారు.
రైతులను ఉద్దేశించి ఆర్డీవో మాట్లాడుతూ.. పేట, కొడంగల్ ఎత్తిపోతల్లో భాగంగా భూత్పూర్ రిజర్వాయర్ ద్వారా ఊట్కూర్ పెద్ద చెరువు, నారాయణపేట మండలం పేరపళ్ల జాయమ్మ చెరువుకు సాగునీరు అందించేందుకు సర్వే పనులు పూర్తి చేశామన్నారు. సర్వే పట్ల రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే పనులు పూర్తి చేయడంతో కొలతల్లో తేడాలు ఉన్నాయని, రీ సర్వే నిర్వహించి భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. సర్వే పూర్తి చేసి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ నష్టపరిహారం చెల్లించే విషయాన్ని ప్రభుత్వం రైతులకు చెప్పడం లేదని ఆరోపించారు.
మరో నెల రోజుల్లో ఖరీఫ్ పంట సాగుకు పొలాలను సిద్ధం చేయాల్సి ఉండడంతో అధికారులు భూ సేకరణ చేపడితే పెట్టుబడులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క వ్యవసాయ భూములను కోల్పోతున్న తమ కుటుంబాలకు భవిష్యత్తులో తీవ్ర నష్టం జరిగి బతుకు భారం అవుతుందని, ప్రభుత్వం స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ చింత రవి, ఇరిగేషన్ ఫేజ్ వన్, ఫేజ్ టు డీఈలు చేతన్, వెంకట రమణ, ఏఈఈ సురేష్, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర రెడ్డి, ఆర్ఐ కృష్ణారెడ్డి, ఏవో గణేష్ రెడ్డి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.