సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా చేపట్టిన రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ), రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణ పనుల్లో వేగం పుంజుకున్నది. రూ.300.20 కోట్లతో ఏడు చోట్ల ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణానికి అనుమతులు లభించగా, ఇటీవల కాలంలో క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టారు. మరికొన్ని చోట్ల రైల్వే శాఖ సమన్వయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ట్రాఫిక్‌కు నిలయమైన ప్రాంతాల్లో ఆర్వోబీ, ఆర్‌యూబీలను చేపట్టి వాహనాలు సాఫీగా వెళ్లేలా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్యూబీ, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోవడంతో పాటు సమయం, ఇంధన ఖర్చులు కలిసి వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు నాటికల్లా వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.