హైదరాబాద్, మార్చి4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు ఏటికేడు సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాతాళగంగా పైపైకి ఎగదన్నుకొస్తున్నది. నెర్రెలుబారిన నేల సైతం నీటి సవ్వడులతో పులకించిపోతున్నది. తెలంగాణ భూగర్భ జల విభాగం ప్రకటించిన తాజాగా గణాంకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన భూగర్భ జలమట్టాల గణాంకాలను అధికారులు 1,160 పర్యవేక్షణ కేంద్రాల ద్వారా సేకరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్ర సగటు భూగర్భజల మట్టం 7.34 మీటర్లుగా ఉన్నది. గతేడాదితో పోలిస్తే 22 జిల్లాల్లో భూగర్భ జలమట్టం 0.34 మీటర్లు పెరిగింది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 2.48 మీటర్ల మేరకు పెరగగా.. అత్యల్పంగా హన్మకొండలో 0.07 మీటర్లు పెరిగింది. మిగిలిన 11 జిల్లాల్లో నీటి మట్టం స్వల్పంగా పడిపోయినట్టు నివేదిక స్పష్టం చేసింది. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 0.06 మీటర్లు తగ్గగా, అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1.87 మీటర్ల మేరకు తగ్గినట్టు తేల్చింది.