‘రింజిం రింజిం హైదరబాద్, రిక్షా వాలా జిందాబాద్!… ‘అటు చూస్తే అసెంబ్లి హాలు, ఇటు చూస్తే జూబిలి హాలు.. తళతళ మెరిసే హుసేను సాగరు దాటితె సికింద్రబాదూ’ అంటూ ప్రముఖ కవి సినారె రాసిన పాట ఆనాటి నగర సౌందర్యాన్ని ఆహ్లాదకరమైన రీతిలో కళ్ళకు కట్టింది. ఇప్పుడు ఆ రిక్షాలు లేవు కానీ, కాల చక్రం తిరిగే కొద్దీ రహదారులపై ఎక్కువగా కార్లు షికారు చేస్తున్నాయి. కాలుష్యానికి విరుగుడు కోసం ప్రపంచం తపిస్తున్న కాలంలో హైదరాబాద్ నగరం ప్రతిష్ఠాకరమైన ఫార్ములా ఈ రేస్‌ను సమర్థవంతంగా నిర్వహించి భళా అనిపించుకున్నది. కార్ల పందెం విజయవంతం కావడం హఠాత్ ఘటన కాదు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోని 25 గొప్ప నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరళ కృషిలో భాగమే ఈ విద్యుత్ కార్ల వినోద క్రీడ.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్ నగరం తన ఆత్మను మళ్ళీ పొందినట్టయింది. ఒకప్పుడు ఢిల్లీ తరువాత హైదరాబాద్‌లోనే విద్యుత్ వెలుగులు విరజిమ్మేవి. ఇప్పుడు మళ్ళీ నిరంతర కరెంటుతో మిలమిలలాడుతున్నది. వైద్య నగరంగా నాటి కీర్తి గుర్తుకొచ్చే విధంగా ముందుకు సాగుతున్నది. ఒకప్పుడు దక్షిణార్ధగోళంలోనే అరుదైన రీతిలో వేధశాలను నిర్మించుకున్న మన నగరం ఇప్పుడు వైమానిక పరిశ్రమకు వేదిక కావడమే కాదు, ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద స్టార్టప్ ఇంక్యూబేటర్గా నిలిచింది. ఒకప్పుడు భారత్ తరఫున ఒలింపిక్స్‌లో ఆడే ఫుట్‌బాల్ జట్టులో అత్యధికులు హైదరాబాదీలే. ఇప్పుడు ఆ క్రీడా స్ఫూర్తిని నగరం ప్రదర్శిస్తూ, అనేక మంది యువ క్రీడాకారులను అందిస్తున్నది. విద్యుత్తు, రహదారులు, మంచినీరుతో పాటు పౌర వసతులు అనూహ్యమైన రీతిలో మెరుగుపడ్డాయి. అత్యంత నివాసయోగ్య నగరంగా మన్ననలు అందుకుంటున్నది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మహిళలు ముందంజలో ఉన్న నగరంగా భాసిల్లుతున్నది.
హైదరాబాద్ ఆతిథ్యాన్ని స్వీకరించిన విశ్వ కవి రవీంద్రుడు, బంజారాహిల్స్ ప్రశాంత సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై, శాంతి నికేతన్ లేకపోతే, తాను ఇక్కడే స్థిరపడుదునని అన్నాడట. ఇప్పుడు బంజారా హిల్స్‌లో జనసమ్మర్దం పెరగవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వ కృషి మూలంగా హైదరాబాద్ నగరం మళ్ళా ‘బాగ్ నగరం’గా మారిపోయింది. ప్రపంచ హరిత నగరంగా, ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా గుర్తింపు పొందింది. నగరానికి ఖ్యాతి చేయడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే అని చేతులు దులుపుకోకూడదు. ఏ నగరానికైనా అసలైన పేరు తెచ్చేది అక్కడి పౌరులే. ప్రత్యేకించి పరిశుద్ధ నగరంగా మార్చుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. నిబంధనలను గౌరవించడం, మర్యాదలు పాటించడం అలవరచుకోవాలి. సమాజం అన్ని రంగాలలో వృద్ధి చెందితే అదే నగరాభివృద్ధిగా మారుతుంది.