పెద్దపల్లి, జూలై 19 (నమస్తే తెలంగాణ): మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుంది పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) పరిస్థితి. అసలే దేశంలో యూరియా కొరత వేధిస్తున్న క్రమంలో తెలంగాణతో పాటు ఆరు రాష్ర్టాల్లో యూరియా సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్ఎఫ్సీఎల్ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మళ్లీ మూతపడింది. ఈ నెల 16న అమ్మోనియా కనెక్టర్ పైప్‌లైన్ లీక్ కావడంతో ప్లాంట్‌ను షట్ డౌన్ చేశారు. మూడు రోజులుగా మరమ్మతులు చేపడుతున్నప్పటికీ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తిరిగి ప్లాంట్ అందుబాటులోకి రావడానికి కనీసం 20 రోజుల వరకూ సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
2025-26లో కేంద్ర, ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. అయితే, ప్లాంట్ వార్షిక మరమ్మతుల నేపథ్యంలో ఈ ఏడాది మే 6న ప్లాంట్ షట్ డౌన్ చేసి, తిరిగి జూన్ 13న పునరుద్ధరించారు. జూన్‌లో 46,347.57 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి జరిగింది. కర్మాగారంలో ఉత్పత్తి అయిన యూరియాలో ఏప్రిల్, జూన్ నెలలకు గాను రాష్ర్టానికి 30 శాతం మాత్రమే కేటాయించారు. మరింత యూరియా అవసరమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఇటీవలే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ.. ప్రస్తుత షట్ డౌన్ కారణంగా అసలుకే మోసం వచ్చింది. దాదాపు 25 రోజుల వరకూ ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉండటంతో యూరియా మరింత కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జెడ్‌ఎల్‌డీ లేకపోవడం వల్లే ..
ఆర్ఎఫ్సీఎల్ను 2021లో రూ. 6,500 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొత్తం ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేయడమే లక్ష్యం కాగా, తరచూ సాంకేతిక సమస్యలు వెంటాడుతుండటంతో లక్ష్యాన్ని అందుకోలేకపోతున్నారు. ప్లాంట్ నిర్మించిన సమయంలోనే మిషనరీతో పాటు జీరో లిక్విడ్ డిశ్చార్జ్(జెడ్‌ఎల్‌డీ)ని సైతం నిర్మించాల్సి ఉండగా, దీనిని నిర్లక్ష్యం చేశారు. ఈ క్రమంలోనే తరచూ సమస్యలు అధికం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ జెడ్‌ఎల్‌డీ నిర్మాణానికి దాదాపుగా రూ.150 కోట్ల దాకా ఖర్చయ్యే అవకాశం ఉండగా, యాజమాన్యం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. దీనికి తోడు గ్యాస్ లీకేజీలు, ఎల్బో లీకేజీలు, అమ్మోనియా లీకేజీలతో షట్ డౌన్లు జరుగుతున్నాయి. దాదాపుగా 25 రోజుల వరకూ ఈ షట్ డౌన్ కొనసాగే అవకాశం ఉండటంతో 96,250 మెట్రిక్ టన్నుల యూరియా, 55 వేల మెట్రిక్ టన్నుల వరకు అమ్మోనియా ఉత్పత్తికి ఆటంకం కలిగే ప్రమాదం ఉన్నది. వ్యవసాయ అవసరాల సమయంలో ఉత్పత్తికి బ్రేకులు పడటంతో తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ర్టాలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.
రాష్ర్టానికి తగ్గిన కేటాయింపులు..
గత నెలలో తెలంగాణకు 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా, అందులో సగం మాత్రమే 15,924.87 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. ఒక వైపు ఉత్పత్తిలో ఇబ్బందులతో పాటు తెలంగాణకు ఇచ్చే యూరియా కోటాలో కేంద్ర ప్రభుత్వం తగ్గింపులు చేయడంతో కోటా తగ్గింది. ఈ విషయమై కేంద్ర రసాయనాల శాఖ మంత్రికి వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో ఆర్ఎఫ్సీఎల్ షట్‌డౌన్ కావడం పట్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలతో ఈ ఏడాది కేటాయింపులకు తగ్గట్టుగా యూరియాను సరఫరా చేయలేకపోయారు. ఏడు రాష్ర్టాలకు 3,30,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 2,40,679మెట్రిక్ టన్నులు మాత్రమే పంపించారు. ఇంకా దాదాపుగా లక్ష మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉంది.