రంగారెడ్డి, జూన్ 19 (నమస్తే తెలంగాణ)/తుర్కయాంజాల్ : తుర్కయాంజాల్‌లో వివాదా స్పద భూమిని పరిశీలించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడికి దిగింది. నా భూమిలోకి ఎందుకొచ్చారంటూ అబ్దుల్లాపూర్‌మెట్ ఆర్ఐ ప్రేమ్‌కుమార్, జీపీవో హన్మంతు నాయక్‌పై దాడి చేసి గల్లపట్టి బూతులు అందుకున్నది. మీరు రెవెన్యూ అధికారులు అయితే ఐడీ కార్డులు చూపించాలంటూ పోలీస్‌స్టేషన్ వరకు లాక్కోని వెళ్లింది. ఆర్ఐ ఐడీ కార్డు చూపించినా దానిని లాక్కునేందుకు యత్నించింది. ఈ భూమిలోంచి వెంటనే వెళ్లి పోవాలని అధికారుల కారుపై రాళ్లు వేసేందుకు యత్నించింది.
తుర్కయాంజాల్ రెవెన్యూ సర్వే నంబర్ 338లో గల 1,810 గజాలపై కొంతకాలంగా ఓ మహిళ.. కొంతమంది గిరిజనులకు మధ్య వివాదం సాగుతున్నది. తరచూ ఘర్షణ జరుగుతుండడంతో బీఎన్ఎస్ 164 సెక్షన్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పోలీసులు ఇబ్రహీంపట్నం ఆర్డీవోను కోరారు. కాగా, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్ఐ ప్రేమ్‌కుమార్, జీపీవో హన్మంత్‌నాయక్ ఆ భూమి వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న మహిళ ఒక్కసారిగా వారిపై దుర్భషలాడుతూ దాడికి దిగింది. దీంతో ఆర్ఐ, జీపీవోలు ఆదిబట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు.
విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ సిబ్బందిపై మహిళ దాడి చేసి విధులకు ఆటంకం కలిగించిందని ఆర్ఐ, జీపీవో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని రెవెన్యూ అధికారులు శుక్రవారం ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ ఘటనపై విచారిస్తున్నా రని.. అనంతరం ఆ మహిళపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులకు నచ్చ జెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.