
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ హవా కొనసాగిస్తున్నది. నియామకాల్లో 80 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఈ విషయం నౌకరీడాట్కామ్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. నియామకాల వృద్ధిలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందని సర్వే పేర్కొన్నది. కరోనా తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా నియామకాలు ఊపందుకుంటున్నాయి. వినియోగం పెరగటం, ఉత్పత్తి, సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రిక్రూట్మెంట్లు చేపడుతున్నాయి. గతేడాది అక్టోబర్లో భారత వార్షిక నియామకాల వృద్ధి 19 శాతం ఉండగా, ఇప్పుడు 43 శాతానికి పెరిగింది.

దేశవ్యాప్తంగా అత్యధికంగా నియామకాలను చేపడుతున్న రంగాలుగా ఐటీ, టెలికం నిలిచాయి. ఐటీ రంగం 85%, టెలికం 84 శాతంతో టాప్లో నిలిచాయి. మెట్రోపాలిటన్ నగరాల వారీగా చూసుకుంటే నియామకాల వృద్ధి బెంగళూరులో 84%, హైదరాబాద్ 80%, పుణె 69%, చన్నై 57%, ఢిల్లీ 51%, ముంబై 46%, కోల్కతా 26 శాతంగా ఉన్నది.

ఆయా రంగాల్లో ఉద్యోగ అనుభవం ఉన్నవారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. 8-12 ఏండ్ల ఉద్యోగ అనుభవం ఉన్న వారి నియామక అవకాశాలు 55% పెరిగాయి. 4-7 ఏండ్ల అనుభవం ఉన్నవారికి ఉద్యోగవకాశాలు 45శాతం వృద్ధి చెందాయి. ఫ్రెషర్స్ (0-3 ఏండ్ల అనుభవం)కు, 13-16 ఏండ్ల అనుభవమున్నవారికి సమానంగా నియామకాల వృద్ధి 36 శాతంగా ఉన్నది. ‘భారత్లో నియామకాల జోరు గతేడాదితో పోల్చితే పెరిగింది. ఇది క్రమంగా పెరుగుతుందని, చెప్పుకోదగ్గ వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం’ అని నౌకరీడాట్కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ పేర్కొన్నారు.