జడ్చర్ల టౌన్, నవంబర్ 23 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని ఉదండాపూర్ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌తో వల్లూరు, ఉదండాపూర్ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ముంపు గ్రామాల్లో సామాజిక, ఆర్థిక గణన రీ సర్వేను మంగళవారం చేపట్టారు. గతంలో చేపట్టిన సర్వేలో తప్పులు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వల్లూరులో తిరిగి సర్వే ప్రారంభించారు. దాదాపు 780కిపైగా కోల్పోతున్న ఇండ్ల కొలతలు, వేర్వేరుగా ఉంటున్న కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. 25 ఇండ్లు, 40 యూబీఆర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇచ్చిన యూబీఆర్ నంబరింగ్ ప్రకారం పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఏడీ శ్రీనివాస్, ఆర్ఐ సుదర్శన్‌రెడ్డితోపాటు సర్వే బృందం సభ్యులు పాల్గొన్నారు.